ఈటల ‘సైలెంట్’.. T-బీజేపీలో తీవ్ర దూమారం రేపుతోన్న MLA వ్యవహారం..!

by Disha Web Desk 19 |
ఈటల ‘సైలెంట్’.. T-బీజేపీలో తీవ్ర దూమారం రేపుతోన్న MLA వ్యవహారం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మౌనం దాల్చారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసే ఈటల కొన్ని రోజులుగా నోరెత్తడం లేదు. దీంతో తెలంగాణ బీజేపీలో ఆయన వ్యవహారం దుమారం రేపుతోంది. కొంతకాలం క్రితం ఢిల్లీ టూర్, అసోం సీఎంతో భేటీ అంటూ హడావుడి చేసిన రాజేందర్ సడెన్‌గా సైలెంట్ అయ్యారు. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. బీజేపీ పెద్దలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అప్పటినుంచి ఈటల మౌనంగానే ఉంటున్నారు.

పార్టీ మారబోతున్నారా..?

బీజేపీలో చేరిన ఈటలకు ఆ పార్టీలో చేరికల కమిటీ అనే పదవిని క్రియేట్ చేసి దానికి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. కానీ అనుకున్న పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లితో భేటీ అయిన ఈటల.. వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారంటూ నిర్వేదపు వ్యాఖ్యలు చేశారు. వీరితో భేటీ తర్వాత ఈటల అనూహ్యంగా అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మతో సమావేశం అయ్యారు. తర్వాత మౌనం దాల్చారు.

బెడిసి కొట్టిన ప్రయత్నాలు

పార్టీలో గుర్తింపు లేదని తన అనుచరులతో ఈటల అంటుంటారని చాలా రోజులుగా ప్రచారం ఉంది. ఈ క్రమంలో తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం వద్ద ఈటల తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. పార్టీ పెద్దలు మాత్రం బండి వైపే మొగ్గు చూపడంతో ఈటల మౌనం దాల్చారని టాక్. వచ్చే ఎన్నికల్లో బండి నేతృత్వంలోనే పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ క్లారిటీ ఇవ్వడంతో తన ప్రయత్నాలకు ఈటల ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఇటీవల కిషన్ రెడ్డి నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి కూడా ఈటల డుమ్మా కొట్టడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

రాజేందర్ తీరుపై సీనియర్ల గుస్సా..!

ఈటల వైఖరిపై తెలంగాణ బీజేపీలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈటలకు బీజేపీ అండగా నిలిచిందని.. ఆయన మాత్రం ఎన్నికల వేళ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కమల దళంలో టాక్ వినిపిస్తోంది. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవడం లేదని కొందరు నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. మరి ఈటల రాజేందర్ మౌనం వీడి పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు చురుగ్గా పాల్గొంటారో వేచి చూడాలి.



Next Story

Most Viewed