బీఆర్ఎస్‌కు సవాలుగా మరో ఎన్నిక!

by Disha Web Desk |
బీఆర్ఎస్‌కు సవాలుగా మరో ఎన్నిక!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరో ఎన్నిక రాజకీయ పార్టీలకు సవాలుగా మారింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉమ్మడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారోబోతోంది. ఈ స్థానానికి ప్రస్తుతం కాటేపల్లి జనార్థన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం 2023 మార్చి 29న ముగియనుంది. దీంతో ఈ స్థానానికి జరగబోయే ఎన్నిక కోసం ఇప్పటి నుంచే ఉపాధ్యాయ సంఘాల్లో హడావుడి మొదలైంది. ఎవరికి వారు తమకు మద్ధతుగా ఉన్న రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న పలు ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఈ స్థానానికి జరగబోయే ఎన్నిక రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తోంది.

అభ్యర్థుల ప్రకటనలో జోరు

ఈ ఎన్నిక కోసం అన్ని సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనే లేదు కానీ అప్పుడే దాదాపు 12 నుంచి 15 సంఘాలు ఇప్పటికే తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాయి. అంతేకాకుండా వారంతా ప్రచారాన్ని సైతం మొదలు పెట్టేశారు. సమయం దొరికినప్పుడల్లా టీచర్లు, అధ్యాపకులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు బిజీ అయ్యారు. పీఆర్టీయూ టీఎస్, పీఆర్టీయూ తెలంగాణ, టీఎస్ యూటీఎఫ్, ఎస్టీయూ, జీటీఏ, లోకల్ కేడర్ జీటీఏ, బీసీటీఏ, టీపీటీఎఫ్, టీయూటీఎఫ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్, కాంగ్రెస్ పార్టీ నుంచి తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని సంఘాలు తమ అభ్యర్థుల ఖరారు విషయంలో కసరత్తు చేస్తున్నాయి.

అభ్యర్థిని మార్చిన అధికార పార్టీ మద్దతు సంఘం

ప్రస్తుత ఎమ్మెల్సీ జనార్థన్ రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ సారి పీఆర్టీయూ అభ్యర్థిని మార్చింది. జనార్ధన్ రెడ్డిని కాకుండా ఆ సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చెన్నకేశవ రెడ్డికి అవకాశం ఇచ్చింది. అయితే జనార్ధన్ రెడ్డికి పీఆర్టీయూ తెలంగాణ సంఘం ఛాన్స్ ఇచ్చింది. మరో వైపు టీఎస్ యూటీఎఫ్ నుంచి మాణిక్ రెడ్డి బరిలో ఉండగా ఎస్టీయూటీఎస్ అభ్యర్థిగా భుజంగరావు, లోకల్ కేడర్ జీటీఏ అభ్యర్థిగా రవీందర్ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నుంచి పోటీ చేయబోయే అభ్యర్థికి బీజేపీ మద్దతు ఉండనుందని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం అభ్యర్థి విషయంలో వర్క్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు యూటీఎఫ్, ఎస్టీయూ అభ్యర్థులకు కమ్యూనిస్టుల అండ ఉండబోతున్నట్టు చర్చ జరుగుతుండగా ఈ సారి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నిక మరింత రసవత్తరంగా మారబోతోందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు కమ్యూనిస్టులు మద్దతుగా నిలిచిన వేళ ఈ ఎన్నిక విషయంలో చివరాఖరులో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల మధ్య మద్దతు ఎలా ఉండబోతోంది అనేది రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

Next Story

Most Viewed