డీకే శివకుమార్ రూట్లో రేవంత్ రెడ్డి.. వ్యూహం మార్చి కీలక పిలుపు!

by Disha Web Desk 2 |
డీకే శివకుమార్ రూట్లో రేవంత్ రెడ్డి.. వ్యూహం మార్చి కీలక పిలుపు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రూట్ మార్చారు. పార్టీ కోసం, ప్రజల కోసం తాను పది మెట్లు దిగేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. క్షణికావేశంలో ఎవరైతే కాంగ్రెస్ ను వీడి బయటకు వెళ్లారో అలాంటి వారంతా తిరిగి కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. వివేక్ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు కాంగ్రెస్ లోకి రావాలని వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కలిసి పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని వారు పార్టీలోకి వస్తే అవసరమైతే నేను వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన వల్లే ఎరికైనా ఇబ్బంది కలుగుతుంది భావిస్తే అధిష్టానంతో గాని సీనియర్లతో గాని మాట్లాడుకోవాలని వారు మీకు సముచిత స్థానం కల్పిస్తారని చెప్పారు. పార్టీ రాష్ట్ర పెద్దగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటానని తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాలనుకుంటున్న వారంతా కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేయడానికి రావాలని కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీది గెలుపే కాదని బీజేపీని సీఎం కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. కర్ణాటక ఫలితాలుపై బండి సంజయ్ ఏ మాటలు చెప్పారో నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ కూడా అవే మాటలు చెబుతున్నారని దీన్ని బట్టే బీఆర్ఎస్, బీజేపీ రెండు వేరు వేరు కావని అర్థం అవుతోందన్నారు.

కర్ణాటక ఫలితాలపై మమతా బెనర్జీ లాంటి నేతలే అభినందనలు చెబుతుంటే కేసీఆర్ మాత్రం కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును గెలుపు కాదనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నిక ఫలితాలతో మోడీ, కేసీఆర్ బ్రాండ్ లకు కాలం చెల్లిందన్నారు. మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ అవసరం ఉందని అన్ని పార్టీలు మాట్లాడుతుంటే కేసీఆర్ మాత్రం నిన్నటి సమావేశంలో కేసీఆర్ మాటలు మోడీ నాయకత్వాన్ని సమర్థించేలా ఉన్నాయన్నారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే విడిపోయినట్లు నాటకమాడుతున్నాయన్నారు. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకువస్తామని, త్వరలో బీసీ గర్జన పెడతామన్నారు. బీసీ జనాభా లెక్కించాలని కాంగ్రెస్ స్పష్టమైన విధానం తీసుకుందని, బీసీ జనాభా లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ కు అర్థమైందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. 200 కోట్ల ప్రభుత్వ ధనంతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వబోతున్నారని, బీఆరెస్ ఖాతాలోని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అభ్యంతరం లేదు. ప్రజా ధనాన్ని పబ్లిసిటీకి వాడుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ కు ఇవే చివరి రాష్ట్ర అవతరణ వేడుకలని తరువాత జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అని ధీమా వ్యక్తం చేశారు.

డీకే రూట్లో రేవంత్?

కర్ణాటక ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా పార్టీకోసం తాను వెనక్కి తగ్గేందుకు సిద్ధమే అని ప్రకటన చేయడం వెనుక కర్ణాటక తరహా పాలిటిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారా అనే చర్చ జరుగుతోంది. కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్ అక్కడ పార్టీ గెలుపు కోసం అన్ని తానై నిలిచారు. ఎన్నికలకు ముందు సిద్ధరామయ్యతో అనవసర పేచీలకు పోకుండా పార్టీ విజయంలో కీలకమయ్యారు. భారీ మెజార్టీ అనంతరం అధిష్టానంతో డీకే హామీ తీసుకున్నాకే సిద్ధరామయ్యకు సీఎం పోస్ట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణలోనూ డీకే ఫార్ములానే అనుసరించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని ఎన్నికలకు ముందు సీనియర్లతో పాటు కేసీఆర్ వ్యతిరేకులను ఐక్యం చేసి తద్వారా అధికారాన్ని బీఆర్ఎస్ నుంచి హస్తగతం చేసుకోవాలనేది రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. మరి రేవంత్ ఆహ్వానంపై మిగతా నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read..

నలుగురు ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి


Next Story

Most Viewed