సర్కార్ దసరా కానుక.. ప్రతి ఇంటికి సుక్కా, ముక్కా పథకం

by Disha Web Desk |
సర్కార్ దసరా కానుక.. ప్రతి ఇంటికి సుక్కా, ముక్కా పథకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సదరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ ప్రస్తుతం మునుగోడు బై పోల్ స్పెషల్.. ఎందుకంటే ఈ సారీ ఈ ఉపఎన్నికకు దసరా పండుగ కూడా తోడైంది. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలకు బంపర్ ఆఫర్ తగిలినట్టయింది. దసరా కానుకగా ప్రతి ఇంటికీ మందు, మటన్‌ డోర్ డెలివరీ కానున్నది. ప్రతి మనిషికీ ఒక క్వార్టర్ లిక్కర్, ప్రతి ఫ్యామిలీకీ కిలో మటన్‌ను టీఆర్ఎస్ పార్టీ ఆఫర్ చేస్తున్నది. నియోజకవర్గంలోని మొత్తం 176 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ మిస్ కాకుండా వీటిని పంపిణీ చేసే బాధ్యతలను ఎంపీటీసీలకు అప్పగించింది. పార్టీ పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. స్థానికంగా ఉన్న పార్టీ నేతలు స్వచ్ఛందంగా ఇస్తున్నదనే మెసేజ్ జనంలోకి వెళ్లాలనే ప్లాన్ వేసింది.

గతేడాది హుజూరాబాద్ బై పోల్ సందర్భంగానూ ఇదే స్ట్రాటెజీని టీఆర్ఎస్ అమలుచేసింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ఈటల రాజేందర్ సైతం స్థానిక నేతల ద్వారా దీన్ని అమలు చేయించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం ఆరు మండలాల (ఇటీవల ఏడవది కొత్తగా ఏర్పాటైంది) పరిధిలోని 176 గ్రామాల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిని మచ్చిక చేసుకునేందుకు దసరా పండుగ సందర్భంగా మందు, మటన్‌ను ఇంటింటికీ డెలివరీ చేయడానికి రంగం సిద్ధమవుతున్నది. దీనికి అనుగుణంగా మద్యం, బీరు బాటిళ్లను రెడీ స్థానిక కార్యకర్తలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఉత్పత్తిని పెంచి మునుగోడుకు డంప్ చేయాలని ఎక్సయిజ్ శాఖ ఉన్నతాధికారి నుంచి ఆదేశాలు వెళ్లాయి. వీటికి తగినట్లుగా డిస్టిల్లరీలు, సప్లై డిపోలు స్టాక్ రెడీ చేసుకుంటున్నాయి. ఒక్క ఫ్యామిలికీ యావరేజ్‌‌గా కిలో చొప్పున మటన్‌ను ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నందున ఆదివారం నుంచే మేకలు, గొర్రెలను మునుగోడుకు రవాణా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏర్పాట్లలో తలామునకలు..

లిక్కర్, బీర్ బాటిళ్ల రవాణా విషయంలోనూ జనాభాకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబానికి సగటున నలుగురైదుగురు ఉన్నా.. సుమారు 60 వేలకు పైగానే ఫ్యామిలీలు ఉంటాయని టీఆర్ఎస్ స్థానిక నేతల అంచనా. ఒకటి, రెండు గంటల వ్యవధిలోనే నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు మందు, మటన్ అందేలా స్థానికంగా ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు వర్క్ డివిజన్ జరుగుతున్నది. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ వ్యూహం బయటకు తెలిసినా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరిస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది.వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో విగ్రహాలు, మండపాల ఏర్పాట్లకు వివిధ పార్టీల నేతలు లక్షలాది రూపాయలను ఖర్చుచేశారు. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగానూ ఖర్చు చేయడానికి కాసులను రెడీ చేసుకున్నారు. ఆ తర్వాత మూడు వారాల్లోనే దీపావళి పండుగ కూడా రాబోతున్నందున టపాసులు, బాణసంచానూ ఓటర్లకు సమర్పించుకోక తప్పదు. ఇలాంటి విషయాల్లో ఓటర్లను ఎంతగా సంతృప్తిపర్చగలిగితే పోలింగ్ నాటికి అంతగా ఓట్లు రాలుతాయన్నది పార్టీల భావన. ఇవన్నీ కాకుండా పోలింగ్ సమయానికి ఓటుకు నోట్లను పంచిపెట్టే ప్రక్రియ ఎలాగూ ఉంటుంది. ఈసారి ఒక్కో ఓటు రేటు ఎంత పలుకుతుందోననే చర్చలు నియోజకవర్గంలో జోరుగా జరుగుతున్నాయి. హుజూరాబాద్‌ను మించిన ఖరీదైన ఎన్నికగా మునుగోడు మారుతుందనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమయ్యాయి. ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ ఖర్చు పెడుతున్నందున ఓటర్లు ఎవరికి పట్టం గడతారనేది కీలకంగా మారింది.


Next Story

Most Viewed