వరకట్న వేధింపులు.. నాచారంలో నవ వధువు ఆత్మహత్య

by Disha Web Desk 2 |
వరకట్న వేధింపులు.. నాచారంలో నవ వధువు ఆత్మహత్య
X

దిశ, నాచారం: అత్తింటి కుటుంబ సభ్యుల వరకట్న వేధింపులకు ఓ నవ వధువు బలైంది. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం.. జనగాం జిల్లా ఘనపూర్ మండలం మాణిక్యాపురం గ్రామానికి చెందిన చౌదరిపల్లి నర్సింలు, వసంతలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పావని(20)కి జనగాం శ్రీనగర్ కాలనీకి చెందిన మరాఠి నాగరాజుతో గత రెండు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లికి ముందు కట్నంగా రూ.28 లక్షలు ఇవ్వడానికి అంగీకారం జరిగింది. బంగారం, ఇతర సామాగ్రి, నగదు కలిపి రూ.16 లక్షల కట్నాన్ని ఇప్పటివరకు అప్పాజెప్పారు.

నవ దంపతులు మల్లాపూర్ నాగలక్ష్మిలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా కట్నం గురించి వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సూటి పోటి మాటలతో భార్యను భర్త వేధించసాగాడు. అంతేగాక, తనపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో వేధింపులు భరించలేక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తండ్రి, మేనమామ వచ్చి నాగరాజుకు సర్ది చెప్పారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆదివారం బెడ్ రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు పావని తల్లి వసంత ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నట్లు సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed