జాన్సన్‌పై అసమ్మతి.. KTR ఫ్రెండ్‌కు షాక్ తప్పదా..?

by Disha Web Desk 4 |
జాన్సన్‌పై అసమ్మతి.. KTR ఫ్రెండ్‌కు షాక్ తప్పదా..?
X

మంత్రి కేటీఆర్... అరేయ్ ఇటు రారా బాయ్ అంటూ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు తన మిత్రుడిగా పరిచయం చేసిన అధికార గులాబీ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్‌పై ఖానాపూర్ నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి పెరుగుతున్నది. ఆయనకు ఉన్న అర్హత కేవలం ఒక్క కేటీఆర్ మిత్రుడు అన్నదే తప్ప... నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను పట్టించుకోవడంలేదని, నియోజకవర్గంలో తాను ఒక్కడినే అన్నట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ కార్యకర్తలు నేతలు లోలోపల మదన పడుతున్నారు. ఇది క్రమంగా బయటపడుతున్నది. తాజాగా దస్తురాబాద్ మండలం మున్యాల్‌కు చెందిన మండల రైతుబంధు సమితి చైర్మన్ సిర్ఫ సంతోష్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 200 మందికి పైగా అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నియోజకవర్గంలో పార్టీ కేడర్ ను అధికార గులాబీ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ పట్టించుకోవడంలేదని, నియోజకవర్గంలో తాను ఒక్కడినే అన్నట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ కార్యకర్తలు నేతలు లోలోపల మదన పడుతున్నారు. ఇది క్రమంగా బయటపడుతున్నది. తాజాగా దస్తురాబాద్ మండలం మున్యాల్ కు చెందిన మండల రైతుబంధు సమితి చైర్మన్ సిర్ఫ సంతోష్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు 200 మందికి పైగా అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఒంటెద్దు పోకడలే కారణమా..?

ఖానాపూర్ గులాబీ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను కాదని టికెట్ తెచ్చుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆయన చిన్ననాటి మిత్రుడిగా పేరు ఉంది. అదే పేరుతో నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికకు ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇదే క్రమంలో జాన్సన్ నాయక్‌ను పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. అయితే నియోజకవర్గంలో ఖానాపూర్ మున్సిపాలిటీ‌తో పాటు ఖానాపూర్ పెంబి దస్తురాబాద్ జన్నారం ఉట్నూర్ ఇంద్రవెల్లి సిరికొండ మండలాలు ఉన్నాయి.

అన్ని మండలాల్లోనూ దాదాపు మండల పరిషత్ అధ్యక్షులు జడ్పీటీసీ సభ్యులు మున్సిపల్ పాలకవర్గం అంతా అధికార పార్టీకి చెందిన నేతలే ఉన్నారు. వీరందరినీ సమన్వయం చేయడంలో జాన్సన్ విఫలం అవుతున్నారని ఏది అడిగినా తాను మంత్రి కేటీఆర్ మిత్రుడిగా చెప్పుకుంటూ వెళ్తుండడం నేతలకు మింగుడు పడడం లేదు. మరోవైపు ఆయన ఒంటెద్దు పోకడలు క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న నేతలను పరిహసించేలా ఉంటున్నాయని సుదీర్ఘకాలంగా పార్టీ ఉద్యమం నాటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

దీనిపై పార్టీ నేతల్లో ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. తమను పట్టించుకోవడం లేదన్న నిరసన వారిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయం నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే అనేకమంది సీనియర్ నేతలు తమ దారి తాము చూసుకునే పరిస్థితి నెలకొని ఉందని ఆ నియోజకవర్గ రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు సీనియర్ నేత పైడిపల్లి రవీందర్రావును సైతం రేఖా నాయక్ వివాదం సమయంలో అనేకసార్లు నియోజకవర్గంలో వినియోగించుకున్నారని ఆ తర్వాత అంటి ముట్టనట్లుగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు పార్టీ కేడర్‌లో ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖ నాయక్‌ను వదిలి అధిష్టానం సూచన మేరకు జాన్సన్ నాయక్ వెంట వెళితే తమకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆయా మండలాల నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముందు నటిస్తూ... వెనుక నుంచి వెన్నుపోటు తప్పదా..?

జాన్సన్ నాయక్‌ను పరిచయం చేసిన మంత్రి కేటీఆర్ సూచన మేరకు తమకు ఎంతో బలంగా ఉంటారని నమ్మిన ఖానాపూర్ నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తాజా పరిస్థితుల్లో తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. ప్రతి విషయంలోనూ జాన్సన్ నాయక్ తనను కలుస్తున్న వారితో మీకు తెలుసుగా... కేటీఆర్..! అంటూ మాట్లాడుతున్న వ్యవహారం అందరిలోనూ ఒకవైపు ఆగ్రహంతో పాటు మరోవైపు అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు జాన్సన్ నాయక్ ముందు నటిస్తూనే... వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం కూడా వినిపిస్తున్నది.

సముదాయిస్తున్న దండే విట్టల్..

ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీలో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్‌కు అప్పగించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జి బాద్యతులను చూస్తున్న ఆయన తన దృష్టికి వచ్చిన ఆరోపణలు వివాదాలపై చర్చలు జరుపుతున్నారు. పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ ను గైడ్ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే నియోజకవర్గంలో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందని కూడా దండే విట్టల్ సుతిమెత్తగా జాన్సన్ నాయక్‌ను హెచ్చరించినట్లు కూడా చెబుతున్నారు.

Next Story

Most Viewed