హిందువులను వేధిస్తే మేం రంగంలోకి దిగుతాం: విశ్వహిందు పరిషత్ నేతలు

by Disha Web Desk 7 |
హిందువులను వేధిస్తే మేం రంగంలోకి దిగుతాం: విశ్వహిందు పరిషత్ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హిందూ దేవాలయాల వద్ద చలాన్లు వేసి వేధించవద్దని, దీన్ని పోలీసుల మానుకోవాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలంగాణలో అత్యంత పవిత్రమైన, ప్రముఖమైన, ప్రతిష్టాత్మకమైన దేవాలయం యాదగిరిగుట్ట అని, అక్కడ కూడా చలాన్లు విధించడమేంటని వారు ప్రశ్నించారు. హిందువులను ఇబ్బంది పెట్టొద్దని రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహాన్‌ను బుధవారం కలిసి వీహెచ్ పీ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలతో పాటు గుట్టకు వెళ్లే రహదారిలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ.. పొల్యూషన్, పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిందేనని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారని, దీంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు.


దీంతో దేవాలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోవాల్సిన పరిస్థితిని ట్రాఫిక్ పోలీసులు తీసుకువస్తున్నారని సీపీకి వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రాచకొండ కమిషనర్ పరిధిలో గల దేవాలయాల అన్నింటి దగ్గర ట్రాఫిక్ పోలీసుల వేధింపులు మానుకోవాలని చౌహాన్‌కు విజ్ఞప్తిచేశారు. ఎక్కడ హిందువులరను వేధించినా తాము రంగంలోకి దిగుతామని విశ్వహిందు పరిషత్ నేతలు హెచ్చరించారు. సీపీని కలిసిన వారిలో వీహెచ్ పీ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, సహకార్యదర్శి భాను ప్రసాద్, వీహెచ్ పీ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు, నాయకులు కిశోర్, చైతన్య ఉన్నారు.



Next Story