కెమికల్ ఫ్ల్యాక్టరీతో అనర్థాలు.. కోర్టును ఆశ్రయించనున్న గ్రామస్తులు

by Disha Web Desk 4 |
కెమికల్ ఫ్ల్యాక్టరీతో అనర్థాలు.. కోర్టును ఆశ్రయించనున్న గ్రామస్తులు
X

దిశ, భిక్కనూరు : వారు పంపిన లైటింగుతో పాటు లక్షల రూపాయలను వాపసివ్వాల్సిందేనని... సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆ ఫ్యాక్టరీతో పోరాటం చేయక తప్పదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. సోమవారం భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో వీడీసీ అధ్యక్షులు మర్రి మహిపాల్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తొగరి సులోచన సుదర్శన్, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ లింగాల కిష్టా గౌడ్, మాజీ ఎంపీపీ అధ్యక్షులు బైండ్ల సుదర్శన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ శివారులో ఉన్న ఎంఎస్‌ఎన్ రసాయనిక ఫ్యాక్టరీ కారణంగా గ్రామంలోని చెరువులో లక్షలు విలువ చేసే చేపలు మృతి చెందాయని తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద నీళ్లు తాగడం కూడా మానేశారన్నారు. ఆ ఫ్యాక్టరీ వదిలే వ్యర్థాల వల్ల నీళ్లు కలుషితమై పంటలు దెబ్బ తినడమే కాకుండా, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు నీళ్లను కెమికల్ ల్యాబ్‌కు పంపిస్తే, నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, ఆ ఫ్యాక్టరీ వెదజల్లే వ్యర్థాల వల్ల గొడ్డు గోదనే కాకుండా, మానవాళీ ప్రాణాలకు కూడా ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వారిచ్చే పైసలు తీసుకుంటే, ఫ్యాక్టరీ యజమాన్యాన్ని ఎలా ప్రశ్నించగలుగుతామని స్పష్టం చేశారు.

వారిచ్చిన పైసలతో పాటు లైటింగ్‌ను తీసుకోవద్దని తేల్చి చెప్పారు. మాజీ ఎంపీపీ అధ్యక్షులు బైండ్ల సుదర్శన్ మాట్లాడుతూ వీడీసీ చేపట్టే ఏ కార్యక్రమానికి రెండు సంవత్సరాలుగా ఆహ్వానించడం లేదని చెబుతుండగా ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన గ్రామస్తులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణను పక్కదారి పట్టించవద్దని సూచించారు. మన గ్రామస్తులు అనుకుంటే ఫ్యాక్టరీ మూత పడుతుందా..? కాదు కదా అందుకే తన భార్య సులోచన సర్పంచ్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే ఆరు నెలల క్రితం గ్రామపంచాయతీ నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.

ఇందులో తన స్వార్థం ఏమీ లేదని, ఫ్యాక్టరీ యజమాన్యంతో కుమ్మకు కాలేదన్నారు. ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధితో పాటు అవసరమైన సమయంలో ఫ్యాక్టరీ యజమాన్యంతో కొట్లాడుడు కొట్లాడుడే అన్నారు. దీంతో ఐదు గంటల పాటు సాగిన ప్రజాభిప్రాయ సేకరణ వాద ప్రతి వాదనలతో అర్ధాంతరంగా ముగిసింది. కాగా ఫ్యాక్టరీ వల్ల జరుగుతున్న నష్టంపై, తమ వద్ద ఉన్న ఆధారాలను వెంటబెట్టుకొని వెళ్లి కోర్టును ఆశ్రయించనున్నట్లు వీడిసి ప్రతినిధులు వివరించారు.



Next Story