ఆ నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ.. గెలుపుపై ధీమా!

by Disha Web Desk 2 |
ఆ నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ.. గెలుపుపై ధీమా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి అభ్యర్థిని బరిలో ఉంచాలని సీపీఐ అధినాయకత్వం భావిస్తున్నది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సీపీఐ పొత్తుల విషయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పొత్తులపై సయోధ్య కుదరక ఇటు రాష్ర్ట నాయకత్వం, అటు ఢిల్లీలో కేంద్ర అధిష్టానం చర్చల అనంతరం కేవలం ఒక సీటుతోనే సీపీఐ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత అనుభవం దృష్ట్యా చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై ముందే తేల్చుకోవాలని సీపీఐ భావిస్తోంది.

ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్

సీపీఐ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. వరంగల్ లోక్‌సభ ఎస్సీ రిజర్వుడ్ స్థానాన్ని సీపీఐ కోరుతోంది. ఈ మేరకు జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తోంది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామకృష్ణ పాండాలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో ఇటీవల కలిశారు. వరంగల్ స్థానాన్ని కేటాయించాలని కోరారు. ప్రస్తుతం భారత్ న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే వెల్లడించినట్లు తెలిసింది.

గెలుపుపై ధీమా

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపోరాటం కారణంగా ప్రజల్లో పట్టు ఉన్నది. ఎన్నికల్లో విజయం సాధిస్తామని సీపీఐ ధీమాతో ఉంది. సీపీఐ అనుబంధ సంఘాలు సింగరేణి, ఎల్ఐసీ, బ్యాంకింగ్ తదితర సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. సీపీఐ అభ్యర్థిని బరిలో ఉంచితే గెలిచే అవకాశముందని భావిస్తున్నది. సీపీఐ గెలుపు అవకాశాలను ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ద‌ృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

సీపీఐ అభ్యర్థి లెనిన్

వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి లెనిన్‌ను బరిలో ఉంచాలని సీపీఐ భావిస్తోంది. సీపీఐ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు తక్కలపల్లి శ్రీనివాస్ రావు సైతం సీపీఐకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కన్నా సీపీఐ ఇక్కడ చాలా బలంగా ఉందని అంటున్నారు. కార్మిక సంఘ నాయకుడైన లెనిన్ తండ్రి అనేక పోరాటాల్లో పాలు పంచుకున్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. లెనిన్ బరిలో ఉంటే విజయం సులభమవుతుందని సీపీఐ రాష్ర్ట నాయకత్వం సైతం భావిస్తున్నది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లెనిన్ సైతం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ర్ట సాధనోద్యమంలో కీలకంగా వ్యవహరించారు. జర్నలిస్టు అయిన లెనిన్ తన కలం ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరానికి నేత‌ృత్వం వహించారు.


Next Story

Most Viewed