లెఫ్ట్ పార్టీల ఐక్యపోరు.. అక్కడి నుంచి ‘సీపీఐ ప్రజా పోరు యాత్ర’

by Disha Web Desk 13 |
లెఫ్ట్ పార్టీల ఐక్యపోరు.. అక్కడి నుంచి ‘సీపీఐ ప్రజా పోరు యాత్ర’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ, సీపీఎంలు మరింత కలిసికట్టుగా కార్యాచరణతో పని చేయాలని, ఎన్నికల్లో కచ్చితంగా కలిసి ఉండాలని నిర్ణయించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 9న హైదరాబాద్ సీపీఐ, సీపీఐ(ఎం)ల మండల పార్టీ నాయకత్వం మొదలు, జిల్లా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఉమ్మడి సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన మగ్దూంభవన్‌లో మీడయాతో మాట్లాడారు. మొదటి సారిగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒకేసారి ఉభయ పార్టీల నాయకత్వం సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ సభకు సీపీఐ, సీపీఎం అగ్ర నాయకులు డి.రాజా, సీతారాం ఏచూరి, డాక్టర్ కె.నారాయణ, విజయ రాఘవన్, బి.వి. రాఘవులు హాజరవుతారని పేర్కొన్నారు.

బయ్యారం నుంచి కాజీపేట వరకు సీపీఐ ప్రజా పోరు యాత్ర..

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ నెల 25 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో బయ్యారం నుంచి హన్మకొండ వరకు ‘సీపీఐ ప్రజా పోరు యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 12 రోజులు 770 కిలోమీటర్ల పాటు ఈ పాదయాత్ర సాగుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు కావొస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని, ఖాజీపేటలో రైల్వే పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాలని, బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, తదితర డిమాండ్ తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు నేతృత్వంలో పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బయ్యారంలో మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభ సూచికగా బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాదయాత్ర మధ్యలో పలు చోట్ల బహిరంగ సభల్లో సీపీఐ జాతీయ నేతలు హాజరవుతారని కూనంనేని తెలిపారు. ఏప్రిల్ 5న హన్మకొండలోని కూడా గౌండ్స్ జరిగే భారీ ముగింపు సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్ 1 లో 90 మార్కులలోపు అర్హులకు పరీక్ష రద్దు చేయొద్దు..

పేపర్ లీకేజీ వ్యవహారంలో చైర్మన్ జనార్ధన్ రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరీక్ష రద్దు చేయడం సంతోషమని, కానీ జరిగిన దానికి నైతిక బాధ్యత వహించి పొరపాటు అని చెప్పాలని కోరారు. క్వాలిఫై మొత్తం పరీక్షల రద్దు కంటే 90 మార్కులకు పైబడిన వారి మొత్తం ఫోన్, వాట్సాప్ సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి, లబ్ది పొందిన వారివి రద్దు చేయాలని, మిగిలిన గ్రూప్ 1 ప్రిలిమినరీ లో 90 మార్కుల లోపు వచ్చిన అర్హుల పరీక్షలను రద్దు చేయడం సమంజసం కాదన్నారు.

ప్రవీణ్ లాంటి వాళ్ళు ప్రస్తుత చట్టాలతో మళ్ళీ బయటకి వచ్చి యథేచ్చగా తిరుగుతారని చెప్పారు. అలా కాకుండా లీకేజీ చేసిన వారికి ఐపీసీ 302 తరహా శిక్షలు పడేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేవలం ఒకరిద్దరే ఇందులో ఉన్నారని వదలొద్దని, అందులో ఉన్న వారందరినీ బైటికి తీసుకురావాలని, లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Next Story