కాంగ్రెస్ యాక్సిడెంటల్‌గా పవర్‌లోకి వచ్చింది.. కిషన్ రెడ్డి సెటైర్లు

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ యాక్సిడెంటల్‌గా పవర్‌లోకి వచ్చింది.. కిషన్ రెడ్డి సెటైర్లు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : బీఆర్ఎస్ గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేమీ లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 12 పార్లమెంట్ స్థానాలను గెలువబోతున్నట్లు చెప్పారు. శుక్రవారం మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ సమర్పించే సందర్భంగా శామీర్ పేటలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. ముందుగా ఉప్పల్ మాజీ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ బేతి స్వప్నలు కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జి. కిషన్ రెడ్డిల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. బేతి సుభాష్ రెడ్డితో పాటు ఉప్పల్‌కు చెందిన పలువురు నేతలకు కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, మేము ఎవరికి బీటీం కాదని స్సష్టంచేశారు. బీఆర్ఎస్ అనేది లేదని, వారికి ఒక్క సీటు రాకపోయినా చేసేదేమి లేదన్నారు.

ప్రమాదవశాత్తు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అపలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదన్నారు. రాహుల్ గాంధీ ఏమి మాట్లాడుతున్నారో.. అయనకే తెలియట్లేదన్నారు. కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చిందో కూడా అర్థం కావడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ధైర్యం, సత్తా కలిగిన నాయకత్వం నరేంద్ర మోడీలో ఉందన్నారు. ఈటల రాజేందర్ అనేక ఉద్యమాలు చేశారు, ఆటు పోట్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. మల్కాజిగిరిలో అత్యధిక మెజారిటీతో ఈటల రాజేందర్ గెలువబోతున్నట్లు విశ్వాసం ఉందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు దేశాభివృద్దికోసం ఏమి చేశాం.. రానున్న ఐదేళ్ల కాలంలో ఏమి చేయబోతున్నాం అనే అంశాలను ఓటర్లకు వివరించాలని కోరారు.

కంటోన్మెంట్ కీలకమే..

మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించాలని జి.కిషన్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ అభ్యర్థి వంశ తిలక్ అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఎన్ని కుట్రలు చేసినా.. బీజేపీ గెలుపును అపలేరన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఓటర్లు నరేంద్ర మోడి నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షుడు పట్లోల్ల విక్రమ్ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, బొడిగే శోభ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, ఘట్ కేసర్ ఎంపీపీ, మేడ్చల్ ఇన్ చార్జీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా నామినేషన్

నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా ఈటల రాజేందర్ నివాసం సందడి నెలకొంది. నామినేషన్ పత్రాలకు ఈటల సతీమణి జమున శామీర్ పేటలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.నామినేషన్ వేసేందుకు వెళ్లుతున్న ఈటలకు మంగళహారతులు ఇచ్చి సాగనంపారు. ఈటల రాజేందర్ తన నివాసం నుంచి మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలు దేరి వెళ్లారు. ఈటల వెంట ఆయన సతీమణి జమున, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ తదితరులు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు వెళ్లారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల అధికారి గౌతమ్ పోట్రుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

Next Story