BC Reservations: ఎలా ముందుకెళ్దాం.. మరికాసేపట్లో గాంధీ భవన్ లో మంత్రుల కమిటీ కీలక భేటీ

by Prasad Jukanti |

బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ ఇవాళ సమావేశం కాబోతున్నది.

BC Reservations: ఎలా ముందుకెళ్దాం.. మరికాసేపట్లో గాంధీ భవన్ లో మంత్రుల కమిటీ కీలక  భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ ఇవాళ సమావేశం కాబోతున్నది. సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో (Gandhi Bhavan) భేటీ కాబోతున్నది. ఈ సమావేశంలో ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వీహెచ్, కే.కేశవరావు,ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొనబోతున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా మందుకు వెళ్లాలనే విషయంలో ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు మంత్రులు భట్టి, ఉత్తమ్‌, పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్కలతో ఈ కమిటీని (Committee of Ministers) ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీల సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం కమిటీనీ నియమించారు. న్యాయకోవిదుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఈ నెల 26వ తేది వరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా కమిటీ ఏర్పాటు చేశారు. కానీ నివేదిక ఇంకా సమర్పించలేదు.

హైదరాబాద్‌లో ఆదివారం ఆడిటర్‌ జనరల్‌తో, ఢిల్లీలో సోమవారం జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీతో మంత్రుల కమిటీ సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో స్పష్టత రాకపోవడంతో మరికొంత మంది న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక మరో ఒకటి రెండు రోజులు ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ లో కమిటీ సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికల విషయంలో ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో సంప్రదింపుల కమిటీ ఆలస్యం కావడం.. ఇవాళ గాంధీ భవన్ లో జరగబోయే భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

Next Story