తాగు, సాగునీటి సమస్యలు రావొద్దు.. సీఎం కేసీఆర్

by Dishafeatures2 |
తాగు, సాగునీటి సమస్యలు రావొద్దు.. సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఇన్ని రోజులు ఒకెత్తు.. ఇప్పుడు ఒకెత్తు.. ఇది ఇరిగేషన్ శాఖకు టెస్టింగ్ టైం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కష్టకాలంలోనే తెలుస్తుందన్నారు. సచివాలయంలో ఆదివారం రాష్ట్రంలో వర్షపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుతం విద్యుత్ డిమాండు తదితర పరిస్థితులపై మంత్రులు, అధికారులతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇది మునుపటి తెలంగాణ కాదన్నారు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదని అధికారులను హెచ్చరించారు.

వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. సంక్షోభ సమయంలోనే పంటలు పండించి చూపించాలని అప్పుడే మనం సిపాయిలం అన్నారు. ‘అన్ని వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి... మీ పరిజ్ఞానాన్ని అంతా పెట్టి ప్రజల కోసం పనిచేయాలి... ఈ పరిస్థితిని సవాల్ గా తీసుకోవాలి...ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది’ అన్నారు. ఈఎన్సీలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు.

దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలో ఆ పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను ఎప్పటికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ, మిడ్ మానేర్ ను నింపాలని అన్నారు. అక్కడి నుంచి లోయర్ మానేర్ డ్యాంకు సగం నీళ్లను, పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి సగం నీళ్లను ఎత్తిపోయాలన్నారు. కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యాపేట, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే కురిసిన వర్షాలకు పత్తి, ఇతరపంటల విత్తనాలు వేసిన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల్లో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకునే పరిస్థితులున్నాయని, విత్తనాలు, ఎరువులు అందించే విధంగా ‘కంటిన్ జెన్సీ ప్లాన్’ సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఉదయ సముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి ఎద్దడి ఉన్నదని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని ఈఎన్సీని ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్ కో కు ఇచ్చేలా విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. బయ్యన్నవాగు నుంచి నీటిని పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలనన్నారు.

Next Story