అత్యంత కీలక సమావేశానికి మరోసారి KCR డుమ్మా.. ఇదే బాటలో మరో ముగ్గురు సీఎంలు!

by Disha Web Desk 19 |
అత్యంత కీలక సమావేశానికి మరోసారి KCR డుమ్మా.. ఇదే బాటలో మరో ముగ్గురు సీఎంలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కాన్ఫరెన్సు హాల్‌లో శనివారం జరగనున్న నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడంలేదు. తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ సమావేశానికి ఆబ్సెంట్ అవుతున్నారు. హాజరుకాకపోవడంపై వేర్వేరు కారణాలను ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాల తరఫున అధికారులను కూడా పంపడం లేదు.

ముఖ్యమంత్రులు మాత్రమే హాజరుకావాలని, వారి తరఫున ప్రతినిధులుగా మంత్రులను, కార్యదర్శులను పంపడంపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాల సీఎంలు హాజరుకావద్దని నిర్ణయించుకున్నారు. అధికారులను పంపే అవకాశం లేకపోవడంతో ఈ నాలుగు రాష్ట్రాల తరఫున ఎవ్వరూ ప్రతినిధులుగా వెళ్ళడంలేదు.

గతేడాది ఆగస్టు నెలలో జరిగిన మీటింగ్‌కు సైతం కేసీఆర్ హాజరు కాలేదు. సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే తీరులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, రాష్ట్రాల అభిప్రాయాలకు విలువ ఇవ్వని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం నిరర్ధకమని గతేడాది మీటింగ్ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసి ప్రధానికి ఈ మేరకు లేఖ రాశారు.

ఈసారి కూడా సమావేశానికి హాజరు కాకూడదనే నిర్ణయం తీసుకున్నారు. నీతి ఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ‘వికసిత్ భారత్ @ 2047 – రోల్ ఆఫ్ టీమ్ ఇండియా’ అనే ఇతివృత్తం ఖరారైంది. లక్ష్య సాధన కోసం రోడ్ మ్యాప్ తయారు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశానికి ప్రధాన టాస్క్ గా పెట్టుకున్నది.

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరఫున రావాల్సిన నిధుల విషయంలో స్పష్టమైన నివేదికను తయారు చేశామని, రాష్ట్రానికి రావాల్సిన పలు పథకాల గురించి కూడా జాబితా రూపంలో సిద్ధం చేశామని, కానీ ముఖ్యమంత్రులు మాత్రమే రావాలంటూ నీతి ఆయోగ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినందున అధికారులు హాజరుకావడంపై తదుపరి సమాచారం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ. 24 వేల కోట్లను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు గతంలో నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పలు సందర్భాల్లో గుర్తుచేశారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పరిగణనలోకి తీసుకోనప్పుడు ఇక సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుని ప్రయోజనమేముందని ఇటీవల గుర్తుచేశారు.

పార్లమెంటు భవనం ఓపెనింగ్‌కూ దూరం

కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభోత్సవం చేసే కార్యక్రమానికి కూడా బీఆర్ఎస్ దూరంగానే ఉండనున్నది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఈ ప్రోగ్రామ్‌కు హాజరు కావడంలేదు. కాంగ్రెస్ సహా మొత్తం 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఈ మేరకు రెండు రోజుల ముందే సంయుక్తంగా ప్రకటన చేశాయి. బీఆర్ఎస్ కూడా బహిష్కరించాలనే నిర్ణయాన్నే తీసుకున్నది.


Next Story