ట్విట్టర్ వార్‌లోకి కిషన్ రెడ్డి ఎంట్రీ.. కేటీఆర్‌కు కౌంటర్

by Disha Web Desk 2 |
ట్విట్టర్ వార్‌లోకి కిషన్ రెడ్డి ఎంట్రీ.. కేటీఆర్‌కు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మతపరమైన రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే మత పరమైన రిజర్వేషన్లను రద్దుచేస్తామని వెల్లడించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని, అలాగే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం ఇచ్చిన రూ. లక్ష కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని చెప్పారు.

ట్విట్టర్ వార్‌లోకి కిషన్ రెడ్డి ఎంట్రీ:

మెడికల్ కాలేజీల కేటాయింపు విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ షుక్ మాండవ్యా మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలు సున్నా అని కేటీఆర్ ట్వీట్ చేయగా అందుకు స్పందించిన కేంద్ర మంత్రి మాండవ్యా తెలంగాణ నుండి అందిన ప్రతిపాదనలు సున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి స్పందించిన కేటీఆర్.. అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నుంచి వచ్చిన లేఖను జతచేస్తూ మళ్లీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు కౌంటర్‌గా హర్షవర్ధన్ లేఖలో 3వ పేరా చదవాలని కేటీఆర్‌కు మాండవ్య సూచించారు. లేఖలకు కాలేజీ మంజూరు చేయరని, పద్దతి ప్రకారం డీపీఆర్‌లు సమర్పిస్తే మెడికల్ కాలేజీ స్కీమ్ వర్తిస్తుందని కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్‌లోకి మంత్రి కిషన్ రెడ్డి ఎంటర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. డీపీఆర్ లు సమర్పించాలంటే చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుందని, ఫామ్ హౌస్‌లో కూర్చున్న వాళ్లకు డీపీఆర్‌లు తయారు చేయడం కష్టమంటూ కిషన్ రెడ్డి ట్వీట్లు చేశారు. టీఆర్ఎస్ విషయంలో డీపీఆర్ అంటే డేలీ ప్రభుత్వాన్ని తిట్టడం అంటూ ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed