మరో 16 మందితో కలిసి 'బూర' కాషాయతీర్థం

by Nagaya |
మరో 16 మందితో కలిసి బూర కాషాయతీర్థం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కాషాయతీర్థం పుచ్చుకున్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి పార్టీకి గట్టి షాకిచ్చినఆయన బుధవారం కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు. కాగా ఆయనకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పార్టీ సభ్యత్వం అందజేయగా.., తరుణ్ చుగ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బూరతో పాటు మరో 16 మంది బీజేపీ కండువా కప్పుకున్నారు. మొత్తంగా ఇతర పార్టీలకు చెందిన 17 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. అందులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ గులాబీ పార్టీకి ఇది తీరని నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయి.

బీజేపీలో చేరిన వారిలో కూకట్ పల్లి అసెంబ్లీ పరిధికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వడ్డేపల్లి రాజేశ్వర రావు సైతం కాషాయతీర్థం పుచ్చుకున్నారు. రాజేశ్వర్ రావు టీటీడీ బోర్డు ఎల్ఏసీ మెంబర్ గా కొనసాగుతున్నారు. ఆయనతో పాటు మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని టీడీపీ సీనియర్ లీడర్ రవి ప్రకాశ్ యాదవ్ బీజేపీలో చేరారు. అదే కోవలో వికారాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, టీఆర్ఎస్ నేత బూర నవీన్ గౌడ్, తాండూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మల్కూడి నరేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో పాటు, తరుణ్​చుగ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేరిక సందర్భంగా ఇప్పటికే కమలం నేతలు ఢిల్లీ బాటపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి హస్తినకు పయనమయ్యారు. బైర నర్సయ్య గౌడ్‌తో పాటు పలువురు నేతలు ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. చేరిక అనంతరం కూడా ఢిల్లీ అగ్రనేతలతో పార్టీ రాష్ట్ర నాయకులు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. మునుగోడుకు సంబంధించి ప్రస్తుత వాస్తవిక పరిస్థితులను అగ్ర నేతలకు వివరించే అవకాశాలున్నాయి.

కేసీఆర్ వి నియంతృత్వ పోకడలు : కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరిక అనంతరం కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌వి నియంతృత్వ పోకడలని, వాటికి చరమగీతం పాడాలని విమర్శలు చేశారు. బీజేపీ పాలన చూసి చాలామంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. తెలంగాణలో.. ప్రజల ఆకాంక్షలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చాలా అవసరమని ఆయన వెల్లడించారు. కేసీఆర్ కనీసం ఇంటి ముందు కూడా ప్రజలను రానివ్వడని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో దళిత బంధు, మూడెకల భూమి ఇంత వరకు ఇవ్వలేదన్నారు. తెలంగాణాలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి, నియంత పాలన కొనసాగుతోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కూడా ఖాయమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రానుందని పేర్కొన్నారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినాదం సబ్ కా సాత్-సబ్ కా వికాస్ తనను బాగా ఆకర్షించాయని కొనియాడారు. అందుకే పార్టీలో చేరినట్లు వెల్లడించారు. తెలంగాణ ఏ ఒక్కరికీ సొంతం కాదని, కొందరి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని పరోక్షంగా ముఖ్యమంత్రిపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధికి పని చేయడమే తన లక్ష్యమన్నారు. టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం చోరువతోనే తన నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed