కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సైలెంట్! అందుకేనా?

by Disha Web Desk 4 |
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సైలెంట్! అందుకేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్లు ఇచ్చే ఆ పార్టీ పెద్దలు.. ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్‌పై మాత్రం నోరు విప్పడం లేదు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవక తప్పదని రెండు రోజుల క్రితం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌పై కాంగ్రెస్ లీడర్లతో పాటు బీజేపీ నాయకులు సైతం తమదైన శైలిలో స్పందించారు. కానీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయారు.

పొత్తు నిజమేనా?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలు స్పందించడం లేదంటే వచ్చే ఎన్నికల తర్వాత నిజంగానే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? అందుకే గులాబీ పెద్దలు మౌనంగా ఉన్నారా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని ఆ పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో తేలినట్టు ప్రచారం జరుగుతున్నది.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ తప్పనిసరి. బీఆర్ఎస్‌తో కలిసి వచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉన్నదని.. అంతర్గత మీటింగ్స్‌లో బీఆర్ఎస్‌ పెద్దలు పలుమార్లు గుర్తుచేశారని ఆ పార్టీ వర్గాల సమాచారం. అందుకే కోమటిరెడ్డి విషయాన్ని గులాబీ పెద్దలు సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తున్నది. ఉత్తర తెలంగాణ‌కు చెందిన ఓ సీనియర్ మంత్రి స్పందిస్తూ 'ఎన్నికల తర్వాత ఏమైన జరగొచ్చు.

ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతు ఇస్తే కాదాంటామా?' అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ట్వీట్ చేసే మంత్రి కేటీఆర్ కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్ స్పందించకపోవడం గమనార్హం.

కాంగ్రెస్‌పై సాఫ్ట్ కార్నర్

గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ విషయంలో కొంత సానుకూలంగా ఉంటున్నట్టు చర్చ జరుగుతున్నది. గతంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై కేసీఆర్ స్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని సూచించారు. తాజాగా.. బడ్జెట్ సమావేశాల్లోనూ నెహ్రూ విధానాలను కేసీఆర్ సమర్థించారు. దేశాభివృద్ధి కోసం నెహ్రూ.. పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసి గొప్ప పనిచేశారని కీర్తించారు. మోడీ కన్నా మన్మోహన్ సింగ్ బెటర్ అంటూ కితాబిచ్చారు.

Next Story

Most Viewed