హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా BRS భారీ స్కెచ్.. గులాబీ పార్టీకి గుంపగుత్తగా ఓట్ల పడేలా నయా ప్లాన్..!

by Disha Web Desk 19 |
హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా BRS భారీ స్కెచ్.. గులాబీ పార్టీకి గుంపగుత్తగా ఓట్ల పడేలా నయా ప్లాన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం ఇప్పటి నుంచే పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. సెల్ప్ హెల్ప్ గ్రూపులు, కుల సంఘాల‌తో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అవసరాలు తెలుసుకుని, అడిగినంత ఇచ్చేందుకు నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు టాక్. కొన్ని సెగ్మెంట్లలో ఒక్కో మహిళా సంఘానికి (గ్రూపునకు) లక్షల్లో నజరానాలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆ గ్రూపును సమన్వయం చేసేందుకు పార్టీ లీడర్‌ను ఇన్‌చార్జిగా బీఆర్ఎస్ నియమిస్తున్నట్టు సమాచారం.

1.77 లక్షల గ్రూపులు

రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల సెల్ప్ హెల్ప్ గ్రూపుల్లో సుమారు 18 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరితో దసరాలోపు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రతి గ్రామంలోని మహిళా సంఘాలను కో ఆర్డినేట్ చేసేందుకు నమ్మకస్తులైన స్థానిక లీడర్‌ను ఇన్‌చార్జిలుగా బీఆర్ఎస్ నియమిస్తున్నట్టు సమాచారం. గ్రూపుల్లోని మహిళలతో నేరుగా మాట్లాడి, ఎన్నికల ప్రచారం మొదలు, ఓటింగ్ పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ కార్యక్రమాలకు వారంతా హాజరయ్యేలా ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకు ఒక్కో గ్రూపునకు లక్షల్లో డబ్బులు ఇచ్చేందుకు గులాబీ లీడర్లు ఆఫర్ ఇస్తున్నట్టు టాక్.

కామారెడ్డిలో ఆఫర్ల మీద ఆఫర్లు

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి సెగ్మెంట్‌లోని మహిళా సంఘాలతో ఇప్పటికే అధికార పార్టీ నేతలు మీటింగ్ పూర్తి చేసినట్టు తెలిసింది. ఒక్కో గ్రూపునకు సుమారు రూ.5 లక్షల వరకు ఆఫర్ చేయడంతో పాటు గ్రూపు బిల్డింగ్ నిర్మాణం కోసం భూమిని కూడా కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రతి పది మంది మహిళా సంఘాలకు ఒక్కో ఇన్‌చార్జిని అపాయింట్ చేసి, రెగ్యూలర్‌గా ఫాలోఆఫ్ చేస్తున్నట్టు తెలిసింది. బతుకమ్మ, దసరా పండుగలకు కావాల్సినంత మటన్, చికెన్ కూడా సరఫరా చేస్తామని గులాబీ నేతలు హామీ ఇస్తున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి.

కుల సంఘాలతోనూ భేటీలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సెగ్మెంట్‌లో ఉన్న అన్ని కుల సంఘాలతో అధికార పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్న గ్రామాల్లో మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. గంపగుత్తగా గులాబీ పార్టీకి ఓట్లు పడేవిధంగా కుల సంఘాల నేతలు చొరవ చూపాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నట్టు టాక్. అందుకు అడిగినంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. దసరాలోపు అన్ని కుల సంఘాలకు చెందిన లీడర్లను నేరుగా కలిసి బీఆర్ఎస్ మద్దతు కోరేందుకు అధికార పార్టీ నేతలు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా నెల రోజుల్లో అంతా సెట్ చేయాలని గులాబీ నేతలు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు సమాచారం.



Next Story

Most Viewed