పదేళ్లుగా జిల్లాలో మాజీ మంత్రి హవా.. ఉద్యమకారులకు టికెట్లు రాకుండా అడ్డగింత!

by Disha Web Desk 2 |
పదేళ్లుగా జిల్లాలో మాజీ మంత్రి హవా.. ఉద్యమకారులకు టికెట్లు రాకుండా అడ్డగింత!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వైఖరిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గులాబీ నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఆయన మాట వినేవారికే టికెట్లు, పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఆయనను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి రాజకీయ భవిష్యత్‌కు అడ్డుపడతారనే ఆరోపణలున్నాయి. ఉద్యమకారులకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నప్పటికీ అడ్డుపడుతున్నారని, ఆయన సూచించిన వారికే టికెట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జగదీష్‌రెడ్డి అనుచరుడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీ జగదీష్ రెడ్డి సలహాలు తీసుకుంటుంది. అయితే దానిని అడ్డుపెట్టుకొని జగదీష్‌రెడ్డి తన ఆధిపత్యం, పట్టు కోల్పోకుండా పాకులాడుతున్నట్లు సమాచారం. గత పదేళ్లుగా జగదీష్‌రెడ్డి హవా జిల్లాలో కొనసాగింది. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రివర్స్ అయింది. ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట తప్ప అన్ని నియోజకవర్గాల్లోనూ ఘోర ఓటమి ఎదురైంది. దీంతో పార్టీ కేడర్ అంతా జగదీష్‌రెడ్డిపై తీవ్రంగా మండిపడుతున్నారు. టికెట్లు మారిస్తే గెలిచే వారమని అంటున్నారు. ఇక ఇప్పటికే ఓటమితో నైరాశ్యంలో ఉన్న కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేయకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యం కోసమే జగదీష్‌రెడ్డి పావులు కదుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఉద్యమకారులకు టికెట్లు రాకుండా అడ్డుకుంటున్నారని..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారులకు కొదవ లేదు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారున్నారు. నల్లగొండ నుంచి చెరుకు సుధాకర్, భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రధానంగా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు కిషన్ రెడ్డి, మల్లేష్ గౌడ్ ఇలా పలువురు నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సైతం టికెట్ రేసులో ఉన్నారు. కానీ వారికి టికెట్ ఇవ్వకుండా, తమ అనుచరులకే టికెట్ ఇప్పించుకోవాలనే జగదీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఉద్యమకారులకు ఇస్తే ఎన్నికల ఖర్చు భరించలేరని, ఇతర కారణాలను అధిష్టానానికి చెబుతున్నారనే మాటలు వినవస్తున్నాయి. పార్టీకి సంబంధం లేకుండా గత ఎన్నికల్లోనూ ఓ వ్యక్తిని తీసుకొని నల్లగొండ నుంచి పోటీ చేయించారని, దీంతో పార్టీ ఓడిపోయిందని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలే మళ్లీ జగదీష్‌రెడ్డి చేస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈసారి ఉద్యమకారులకు టికెట్ ఇవ్వకుంటే పార్టీకి దూరమయ్యే అవకాశం లేకపోలేదు.

మాజీమంత్రి తీరుతో పార్టీని వీడిన నేతలు..

జగదీష్‌రెడ్డి తీరుతో ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు పార్టీని వీడారు. పార్టీలో సీనియర్ నేతలు మందుల సామేల్, వేముల వీరేశం, వేనేపల్లి చందర్ రావు, పాశం రాంరెడ్డి‌తో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీని వీడారు. ఈ మధ్య కాలంలో హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. నల్లగొండ ఎంపీ టికెట్ ఆశించిన గుత్తా అమిత్ రెడ్డి సైతం జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సహకరించకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన అమిత్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సైతం పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకా ఎవరెవరు పార్టీ మారే లిస్టులో ఉన్నారో అని పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

కాగా, జగదీష్ రెడ్డి వైఖరితోనే జిల్లా నేతలు ‘గులాబీ’ని వీడుతున్నారని, ఆయన వ్యవహారశైలి మార్చుకోకపోతే జిల్లాలో పార్టీకి గడ్డుపరిస్థితులు తప్పవని, చివరకు పార్టీ జెండా మోసేవారు కూడా కరువు అవుతారని పార్టీనేతలే అభిప్రాయపడుతన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయినప్పటికీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాలేదు. రెండ్రోజుల్లో క్లారిటీ వస్తుందని అధినేత చెప్పి వారం రోజులు గడిచినా ముందు పడలేదు. జగదీష్ రెడ్డి జోక్యంతోనే అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని మీడియా జగదీష్ రెడ్డిని హైదరాబాద్‌లో అడగగా అభ్యర్థుల ఎంపిక విషయంలో తొందర ఏమీలేదని, సమయం ఉందంటూ దాటవేశారు. అంటే ఆయన చెప్పినవారి పేర్లను అధిష్టానం ఓకే చేయకపోవడంతోనే అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవుతోందని విశ్వసనీయ సమాచారం.


Next Story

Most Viewed