బీఆర్ఎస్ బీసీ మంత్రం.. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్

by Disha Web Desk 1 |
బీఆర్ఎస్ బీసీ మంత్రం.. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరును అధినేత కేసీఆర్ బుధవారం రాత్రి ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి భారత రాష్ట్ర సమితి బీసీలకు పెద్దపీట వేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తరించిన రెండు పార్లమెంట్ స్థానాలకు బీసీలకు సీట్లను కేటాయించింది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఐదు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. అందులో బాజీరెడ్డి గోవర్ధన్ మూడు నియోజకవర్గాల్లో మంచి పట్టుంది.

పార్లమెంట్ సెగ్మెంట్‌లో మున్నూరు కాపు సామాజిక వర్గం చెందిన ఓట్లు బలంగా ఉండడంతో బాజిరెడ్డిని బరిలో దించితే సిట్టింగ్ ఎంపీని ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు వేస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మూడు స్థానాలు గులాబీ పార్టీ గెలవడంతో ఈసారి ఏవిధంగానైనా గెలవాలని ఓటు బ్యాంకు పెంచుకోవాలని బాజిరెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. అక్కడ బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ ఇటీవల ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. బీజేపీలో చేరి బీఆర్ఎస్‌పైనే పోటీకి సిద్ధమయ్యారు. గత రెండుసార్లు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంపీగా ఉండటంతో ఈసారి కూడా నా స్థానాన్ని గెలుచుకోవాలని గులాబీ పార్టీ బలమైన బీసీ సామాజికవర్గం నేత గాలి అనిల్ కుమార్‌ను బరిలోకి దించింది.

సీనియారిటీకే పట్టం.. బాజిరెడ్డికి టికెట్ ఖరారు

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సీనియర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ పేరు‌ను ఎట్టకేలకు ఖరారు చేశారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటనపై సందిగ్ధం నెలకుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి పోటీపై చాలామంది పేర్లు తెరపైకి వచ్చిన చివరకు బాజిరెడ్డి గోవర్ధన్ పేరును ఖరారు చేశారు.

బాజిరెడ్డి గోవర్ధన్ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోని నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి గోవర్ధన్ అత్యంత సీనియర్ రాజకీయవేత్త. సిరికొండ మండలం చీమన్ పల్లి గ్రామానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ 1978 లో పోలీస్ పటేల్‌గా, 1981 గ్రామ సర్పంచిగా పని చేశారు. 1987 లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి‌కి అత్యంత ఆప్తుడిగా పేరుగాంచారు. ఒకప్పుడు మాజీ మంత్రి శనివారం సంతోష్‌రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ ఆయనతో విభేదించి ఆయనపైనే ఆర్మూర్ నియోజకవర్గంలో 1994 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 1999-2005 ఆర్మూర్, 2005-2009 వరకు బాన్సువాడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఅర్ఏస్‌లో చేరారు. 2014 లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్‌పై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి భూపతి‌రెడ్డిని ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్ గాను పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత సీనియర్ కావడంతో బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఎంపీ అభ్యర్థిగా బరీలు దించడం ఖాయమైంది. బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడడం ఇదే మొదటిసారి.

జహీరాబాద్ టికెట్ బీసీకే..

జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్‌కు దక్కింది. ఆయన పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన వారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పనిచేసిన ఆయనకు గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గాలి అనిల్‌కుమార్ పేరు జాబితాలో జహీరాబాద్ స్థానం పోటీలో బరిలో దించుతూ కేసీఆర్ నిర్ణయించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఆసక్తి చూపారు. కానీ, ఆయనకు నిరాశ తప్పలేదు. బీఆర్ఎస్ పార్టీలో జహీరాబాద్‌కు పూర్వపు మెదక్ జిల్లా చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించడంతో లుకలుకలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పూర్వపు నిజామాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. గతంలో రెండుసార్లు ఎంపీ అయినా బీబీ పాటిల్ కామారెడ్డి జిల్లా వాసి కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన ఓటమిపాలయ్యారంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయనే చెప్పాలి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాతో సంబంధంలేని గాలి అనిల్ కుమార్ కారు పార్టీ తరపున బరిలో దిగుతుండడంతో అతడికి గులాబీ తమ్ముళ్లు ఎంత మేరకు సహకరిస్తారో మరి వేచి చూడాలి. జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓటర్లను నమ్ముకుని కేసీఆర్ అనిల్ కుమార్ ఎంపిక చేసినా.. ఆ పాచిక ఎంతమేరు పారుతుందో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed