అలర్ట్: మహిళల్లో పెరుగుతోన్న మూత్రకోశ ‘ఇన్​ఫెక్షన్లు’.. క్లినిక్​లకు క్యూ కడుతోన్న అనుమానితులు

by Disha Web Desk 19 |
అలర్ట్: మహిళల్లో పెరుగుతోన్న మూత్రకోశ ‘ఇన్​ఫెక్షన్లు’.. క్లినిక్​లకు క్యూ కడుతోన్న అనుమానితులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల్లో మూత్రకోశ ఇన్ ఫెక్షన్లు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ​వీక్​ ఆరోగ్య మహిళా పథకం నిర్వహణలో 718 మందికి మూత్రకోశ సంబంధిత సమస్యలను గుర్తించి చికిత్సను షురూ చే శారు. వీరిలో అత్యధికంగా 142 మంది ఆరోగ్యశాఖ మంత్రి ప్రాతినిత్యం వహిస్తున్న సిద్ధిపేట్ ​జిల్లాకు చెందిన వారు ఉండటం గమనార్హం.ఆ తర్వాత ప్లేస్ నల్లగొండలో 67, కరీంనగర్‌లో63, ఖమ్మంలో 55 మంది చొప్పున బాధితులు తేలగా, అతి తక్కువగా సిరిసిల్లాలో 3, ఆసీఫాబాద్​లో మరో ముగ్గురు చొప్పున పేషెంట్లకు మూత్రకోశ ఇన్​ఫెక్షన్ల చికిత్స ప్రారంభించారు.

ఈ నెల 21న నిర్వహించిన రెండో రౌండ్ ​కార్యక్రమంలో 6,328 మంది మహిళలు ఆరోగ్య మహిళ క్లినిక్స్‌ను సందర్శించారు. వీరిలో 3,753 మందికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 884 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 3,783 మందికి నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు మరో1029 మందికి సూక్ష్మ పోషక లోప నిర్ధారణ పరీక్షలు, 777 మందికి థైరాయిడ్ పరీక్షలు, 477 మందికి విటమిన్ - డీ లోప పరీక్షలు, 1294 మందికి సీబీపీ (కంప్లీట్​బ్లడ్​పిక్చర్​)పరీక్షలు నిర్వహించారు.

క్యాన్సర్ల​ దడ..!

సిద్ధిపేట్​, కరీంనగర్​, ఖమ్మం జిల్లాల్లోని మహిళలకు క్యాన్సర్ల ఆందోళన నెలకొన్నది. ఈ నెల 21 న నిర్వహించిన ఆరోగ్య మహిళా స్కీమ్​ క్యాంపులో సిద్దిపేట్ జిల్లాలో 539 మంది, కరీంనగర్​లో 414 మంది, ఖమ్మంలో 311 మంది, మెదక్​‌లో 339 మంది మహిళలకు అత్యధికంగా బ్రెస్ట్, నోటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఎంత మందిలో కన్ఫామ్​ అయిందనే విషయాన్ని వైద్యశాఖ రిపోర్టులో పేర్కొనలేదు.

11 వేల మందికి..

మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "ఆరోగ్య మహిళ" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. కేవలం రెండు మంగళ వారాల్లో కలిపి 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ నెల 14న (ఫస్ట్​ మంగళవారం) 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా, ఇందులో 975 మందికి అవసమైన మందులు అందజేశారు.

ఉన్నత స్థాయి వైద్యం అవసరం ఉన్నవారిని, సమీపంలోని రిఫెరల్ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి వైద్య సేవలు అందిస్తుండటం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేక కొందరు, వ్యాధి లక్షణాల పై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక మరికొందరు ఇబ్బంది పడ్డారు.

ఇప్పుడు అలాంటి వారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు పొందుతున్నారు. ప్రస్తుతం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఈ కేంద్రాలలో మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.

మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతో పాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు. ఇక నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.

‘‘మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం = హరీశ్ రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి

సీఎం కేసీఆర్ఆ లోచనతో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం "ఆరోగ్య మహిళ" అనే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళల కోసం 100 అరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం, మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అరోగ్య మహిళ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను’’

Next Story

Most Viewed