ఫోర్త్ ఫేజ్‌కు రంగం సిద్ధం.. ప్రతి నియోజకవర్గంలోనూ 'బండి' భారీ ప్లాన్!!

by Disha Web Desk 2 |
ఫోర్త్ ఫేజ్‌కు రంగం సిద్ధం.. ప్రతి నియోజకవర్గంలోనూ బండి భారీ ప్లాన్!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ 4వ విడుత ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి షురూ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్టు సమాచారం. తొలుత పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలని కాషాయదళం భావించింది. అందుకే మూడు విడుతలు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లోనే సాగింది. ఫోర్త్ ఫేజ్‌లో మాత్రం అర్బన్ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెడుతున్నట్టు తెలిసింది.

మల్కాజ్‌గిరి నుంచి షూరూ

నాలుగో విడుత ప్రజా సంగ్రామ యాత్ర...మూడు విడుతలకు భిన్నంగా నిర్వహించనున్నట్టు ఆ శ్రేణులు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పలు జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో మూడు విడుతలు అక్కడే సాగింది. నెక్స్ట్ ఫోకస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వేయాలని భావించిన పార్టీ నేతలు మునుగోడు బైపోల్ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక అక్టోబర్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర చేపడితే ప్రచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని, అందుకే మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, ఎక్కడ ప్రారంభం, ఎక్కడ ముగింపు అనే అంశాలపై సెప్టెంబ‌ర్ 2, 3 తేదీల్లో క్లారిటీ రానున్నది. జీహెచ్ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి ప‌రిధిలోని నాయ‌కులు, కార్యక‌ర్తలతో స‌మావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ వ‌ద్ద ఎండ్

కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభించే యాత్రను వ్యూహాత్మకంగా అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ వ‌ద్ద ముగించాల‌నే యోచ‌న‌లో బీజేపీ శ్రేణులు ఉన్నారు. యాత్ర ముగించే ప్రాంతం నుంచి మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం కేవలం 10 నుంచి 15 కిలోమీట‌ర్ల దూరం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో పాటు ఉప ఎన్నిక ప్రచారానికి కూడా ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రతి నియోజకవర్గంలోనూ భారీ సభ

మల్కాజ్‌గిరి నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం గాజుల‌రామారంలోని చిత్తార‌మ్మ అమ్మవారి ఆల‌యం నుంచి లేదంటే సూరారంలోని క‌ట్టమైస‌మ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి షురూ చేస్తే బాగుంటుందని ఇప్పటికే నాయ‌కులు రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేసినట్లు తెలుస్తున్నది. కుత్బుల్లాపూర్, కూక‌ట్‌ప‌ల్లి, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీ‌న‌గ‌ర్‌, ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల గుండా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ రోజున్నర నుంచి రెండు రోజుల పాటు యాత్ర కొన‌సాగించనున్నట్లు వినికిడి. ప్రతి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో భారీ స‌భ‌ నిర్వహించాల‌ని చూస్తున్నారు. డైలీ కనీసం 12 నుంచి 16 కిలోమీట‌ర్ల మేర యాత్ర కొన‌సాగించాల‌ని ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.

రేవంత్‌రెడ్డి నియోజక వర్గంలో పాగా!

మ‌ల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగో విడ‌త పాద‌యాత్ర నిర్వహించి టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్నది. అంతే కాకుండా కాంగ్రెస్‌‌ను నామ‌రూపాలు లేకుండా చేయాల‌న్నదే టార్గెట్‌గా పని చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. నాలుగో విడుత యాత్రలో ప్రముఖ గాయకుడు గోరేటి వెంక‌న్న 'గ‌ల్లీ సిన్నది.. గ‌రీబోళ్ల క‌థ పెద్దది' పాటను విస్తృతంగా వినియోగించుకుని ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు వేసేందుకు కాషాయ దళం సిద్ధమవుతున్నది.

Also Read : మునుగోడు బరిలో YSRTP.. ఆ సామాజిక వర్గానికే టికెట్?

Next Story

Most Viewed