మునుగోడు బరిలో YSRTP.. ఆ సామాజిక వర్గానికే టికెట్?

by GSrikanth |
మునుగోడు బరిలో YSRTP.. ఆ సామాజిక వర్గానికే టికెట్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిలవనున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ఆ పార్టీ శ్రేణులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. దీనిపై పార్టీ కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాల్సి ఉండటంతో ఎవరైతే బాగుంటుందనే దానిపై పార్టీ తర్జన భర్జన పడుతున్నది. గతేడాది ఫిబ్రవరిలో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన షర్మిల ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. నేరుగా సాధారణ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని ప్రకటించారు. కాగా ఇప్పుడు మునుగోడు బైపోల్‌లో నిలవాలని అనుకోవడం వెనుక ఉన్న కారణాలేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ వైఎస్సార్‌కు విధేయులుగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే వారికి అమితమైన అభిమానం. షర్మిల నిర్వహించిన నిరాహారదీక్ష సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి మరీ తన మద్దతు ప్రకటించారు. అలా వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న వ్యక్తిపై షర్మిల పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలని అనుకుంటున్నారు. గతంలో హుజురాబాద్ ఎన్నికల్లో బరిలో నిలుస్తారా ? అన్న ప్రశ్నకు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో తాము పాల్గొనేది లేదని తేల్చి చెప్పిన షర్మిల ఇప్పుడు మునుగోడు ఎన్నికల బరిలో తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టాలనుకోవడం చర్చనీయాంశమైంది.

బీసీ సామాజిక వర్గానికే ఛాన్స్ ?

వైఎస్సార్ టీపీ నుంచి మునుగోడు బరిలో ఎవరిని నిలుపుతారనేది సస్పెన్స్‌గానే మారింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీలో ఉంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బలమైన అభ్యర్థి గురించి అన్వేషణ సాగుతున్నట్లు తెలుస్తున్నది. అభ్యర్థి ఎంపికపై అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. హస్తం పార్టీ నుంచి తమ పార్టీలోకి లాగి వారికి టికెట్ కేటాయించాలని వైఎస్ షర్మిల ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి షర్మిల పార్టీలో ప్రభావం చూపగలిగేంత బలమైన అభ్యర్థులెవరూ లేరు. ఒకవైపు బరిలో నిలవాలనుకుంటున్నా అభ్యర్థి ఎంపిక వారికి క్లిష్టతరంగా మారనున్నది. అందుకే కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్నట్లు టాక్. తెలంగాణలో పార్టీ ఏర్పాటు తర్వాత మొదటిసారి ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న షర్మిల పార్టీ విజయఢంకా మోగిస్తుందా ? అపజయాన్ని మూట గట్టుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే.

Also Read : ఫోర్త్ ఫేజ్‌కు రంగం సిద్ధం.. ప్రతి నియోజకవర్గంలోనూ 'బండి' భారీ ప్లాన్!!

Next Story

Most Viewed