జాగ్రత్తగా మాట్లాడు కేటీఆర్.. నోటికొచ్చింది వాగకు: రఘునందన్ రావు

by Disha Web Desk 2 |
జాగ్రత్తగా మాట్లాడు కేటీఆర్.. నోటికొచ్చింది వాగకు: రఘునందన్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ తనపై విమర్శలు చేసే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తనకు తెలంగాణ యాస వచ్చినంత మాత్రాన నోటికొచ్చింది వాగితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిండు సభలో మంత్రి కేటీఆర్.. కేసీఆర్‌కు, తెలంగాణకు విడదీయరాని పేగు బంధం ఉందని అన్నారని, అయితే కేసీఆర్ ఖమ్మం సభలో జై తెలంగాణ అని అనలేదని, జై భారత్ అన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కానీ తాను అసెంబ్లీలో మాట్లాడటం పూర్తయ్యాక జై తెలంగాణ అని నినదించాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారన్నారు. కేసీఆర్.. తెలంగాణ నినాదం మరిచిపోయారని చెప్పినందుకే తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఏపీ నేతలు కేసీఆర్ మూలాలు బీహార్ ప్రాంతానికి చెందనవని చెప్పినపుడు తాను నమ్మలేదని, కానీ ఇటీవల అక్కడి అధికారులకు పెద్ద పీట వేయడంతో నిజమేననిపిస్తోందన్నారు.

అందుకే సీఎస్‌గా ఏండ్ల పాటు సోమేశ్ కుమార్‌ను పెట్టుకున్నాడన్నారు. అంతేకాకుండా డీజీపీగా అంజనీ కుమార్ కూడా బిహారీయేనని గుర్తుచేశారు. అడిషనల్ డీజీ(లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ జైన్, ఐజీ షానవాజ్ ఖాసీం, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీ స్వాతి లక్రాది కూడా బిహారేనని ఆయన వెల్లడించారు. కేసీఆర్ కూడా బీహార్‌కు చెందిన వ్యక్తి కాబట్టి తెలంగాణను కూడా రౌడీల రాజ్యంగా చేయాలని చూస్తున్నాడని విమర్శలు చేశారు. సైబర్ కంట్రోల్ చీఫ్, సైబర్ సెక్యూరిటీ ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారని, ఈయన బీహార్‌కు చెందినవాడు కాదని, అయితే ఉద్యమ సమయంలో పోరాడే వారిని అణిచివేసిన వ్యక్తికి ఈ పదవి కేటాయించారన్నారు. కీలకమైన పదవులన్నీ బిహారీల చేతుల్లోనే ఉన్నాయని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణకు చెందిన వారికి మాత్రం మొండిచేయి చూపించారని, వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఐపీఎస్ ల తరుపున తాను పోరాడుతానని ఆయన స్పష్టంచేశారు. వాస్తవానికి అంజనీ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించారని, సోమేశ్ కుమార్‌ను ఏపీకి పంపించినట్లే ఈయన్ను కూడా ఇక్కడి నుంచి పంపించివేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 93 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిందని, ఇవన్నీ ఎన్నికల కోసమే చేసిందని ఆయన ఆరోపించారు. ఆ 93 మందిలో తెలంగాణకు చెందిన వ్యక్తులకు ఒక్కరికీ ఉన్నత పదవి లభించలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యక్తులకు అటెండర్ పోస్టులు.. ఇతరులకు కీలక పోస్టులా అని ఆయన ప్రశ్నించారు. జలదృశ్యం జరిగిన నాడు కవిత, కేటీఆర్ ఇక్కడ లేరని, అమెరికాలో ఉన్నారన్నారు. కేటీఆర్ లాంటి వ్యక్తిని కూడా అమెరికా నుంచి రప్పించి జై తెలంగాణ అని అనిపించింది రఘునందన్ రావు అనే విషయాన్ని మర్చిపోవద్దని మంత్రికి కౌంటర్ ఇచ్చారు. 4 కోట్ల మంది కేసీఆర్ కుటుంబమే అయితే శ్రీకాంతాచారి కుటుంబానికి ఎందుకు పదవులు దక్కలేదని రఘునందన్ ప్రశ్నించారు.

1200 మంది అమరులు, రిపోర్టర్ లక్ష్మారెడ్డి, డీఎస్పీ నళిని, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాలు ఎందుకు సీఎం కుటుంబం కాలేకపోయిందని నిలదీశారు. వారిని మీ కుటుంబంగా భావించినట్లయితే వారికి ఎప్పుడో ఉన్నత పదవులు దక్కేవన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్సీగా కవిత కాకుండా డీఎస్పీ నళిని ఉండేదని ఘాటుగా స్పందించారు. మంత్రి కేటీఆర్ దుబ్బాకలో వచ్చి కరపత్రాలు పంచుతానన్నాడని, ఆయనకు భయమైతే అతడి బావ, అతడి తండ్రిని కూడా తీసుకురావొచ్చన్నారు. ఇక అసెంబ్లీలో ఎంఐఎం 50 సీట్లలో పోటీ చేస్తామని చెప్పిందని, వారికి దమ్ముంటే 119 సీట్లలో పోటీ చేయాలని రఘునందన్ సూచించారు. గెలిచినా, ఓడినా వారి మద్దతు బీఆర్‌‌ఎస్‌కు ఉంటుందని ఎంఐఎం నేతలు ఆన్ రికార్డులో చెప్పారన్నారు. ప్రజలు దీనిపై ఆలోచన చేయాలని రఘునందన్ కోరారు. ఇవ్వాళ మంత్రి కేటీఆర్ వెలుగులో ఉన్నాడని, తాము చీకట్లో ఉన్నామని, తాము తప్పకుండా వెలుగులోకి వస్తామని, అప్పుడు ఆ చీకట్లు ఎలా ఉంటాయో వారికి కూడా తెలుస్తుందని చురకలంటించారు.


Next Story

Most Viewed