ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి! ఎందుకో తెలుసా?

by Disha Web Desk 14 |
ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి! ఎందుకో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలకు ప్రముఖ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉన్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ చేపట్టే ఏ చిన్న కార్యక్రమానికైనా హజరయ్యే రాజాసింగ్ లోక్‌సభ ఎన్నికల ముందు చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో కనబడకపోవడం తో పార్టీ శ్రేణుల్లో చర్చానీయాంశంగా మారింది. అయితే బీజేపీ అధిష్టానంపై కొంత అసంతృప్తి ఉండటం వల్లే ఈ విజయ సంకల్ప యాత్రలకు రావడం లేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

విజయ సంకల్ప యాత్రలకు దూరం?

సోమవారం విజయ సంకల్ప యాత్ర రథాలకు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజాసింగ్ తప్ప కీలక నేతలందరూ హాజరయ్యారు. భాగ్యలక్ష్మి ఆలయంలో జరిగే పార్టీ పూజలకు హజరయ్యే రాజాసింగ్ ఈ యాత్ర పూజలకు హాజరు కాకపోవడం.. అధిష్టానంపై ఉన్న అసంతృప్తి ఊహాగానాల పుకార్లను బలపరుస్తోంది. నేడు జరిగిన విజయ సంకల్ప యాత్రలకు కూడా రాజాసింగ్ రాలేదు.

బీజేపీ పక్కన పెట్టిందనే చర్చ..!

ఇటీవల బీజేఎల్పీ టీమ్‌లో రాజాసింగ్‌కు అవకాశం దక్కలేకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయినట్లు సమాచారం. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినప్పటికీ బీజేపీఎల్పీలో రాజాసింగ్‌కు చోటు దక్కలేదు. బీజేపీఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డి, బీజేపీ చీఫ్ విగా పాల్వాయి హరీశ్, విప్‌గా ధన్‌పాల్ సూర్యనారాయణ, ట్రెజరీగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని బీజేపీ నియమించింది. దీంతో రాజాసింగ్‌కు మొండి చేయి చూపించినట్లైంది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌ మనస్తాపంతో ఉన్నట్లు ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాజాసింగ్‌ను పక్కన పెట్టిందని చర్చ జరుగుతుంది. కానీ ఆయనకు మరో కీలక పదవి ఇచ్చేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు, అందుకే బీజేపీఎల్పీలో చోటు దక్కలేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.



Next Story