Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో బిగ్ ట్విస్ట్!

by Rajesh |
Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో బిగ్ ట్విస్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం బిల్లును ప్రవేశపెట్టింది. కానీ రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ దక్కే అవకాశాల్లేవ్. 2028 తర్వాత జరిగే ఎన్నికలకు మాత్రమే వర్తించేలా బిల్లులో కొన్ని షరతులు ఉన్నాయి. కేవలం ప్రజలు నేరుగా ఎన్నుకునే లోక్‌సభ, అసెంబ్లీలకు మాత్రమే మహిళా రిజర్వేషన్ వర్తించనున్నది.

శాసనమండలి, రాజ్యసభలకు ఈ రిజర్వేషన్ విధానం వర్తించదు. లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో మూడవ వంతు రొటేషన్ పద్ధతిలో మహిళలకు కేటాయింపు జరగనున్నది. ప్రతీ డీలిమిటేషన్ ప్రక్రియకు ఒకసారి ఈ రొటేషన్ మారుతుంది. ఈ బిల్లు ప్రకారం మహిళలకు రిజర్వేషన్ 15 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగనున్నది. ఆ తర్వాత కూడా ఇది కంటిన్యూ కావాలంటే ప్రభుత్వం విడిగా చట్టం ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం.. చర్చల అనంతరం ఆమోదం పొంది చట్టంగా మారాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా నోటిఫై చేయాలి. ఆ తర్వాత జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంటుంది. ఆ లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ కమిటీ ఏర్పడి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంటుంది.

షెడ్యూలు ప్రకారం 2021లోనే జనగణన ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నది. కానీ కరోనా కారణంగా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. డిజిటల్ పద్ధతిలోనే జనాభా లెక్కల సేకరణ జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినా 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఆ లెక్కల ప్రక్రియ పూర్తయ్యి దాని ఆధారంగా డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్ ఖరారు కానున్నది.

ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నందున వీటిలోనూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. యూపీఏ హయాంలో 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన తరహాలోనే ప్రస్తుతం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఉన్నది. ఓబీసీ రిజర్వేషన్ గురించి ఈ బిల్లులో ఎలాంటి ప్రస్తావనా లేకపోవడంతో అది సాకారమయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు ఆచరణలోకి రావాలంటే రాజ్యాంగానికి సవరణలు (ఆర్టికల్ 230-ఏఏ, 330, 332, 334) జరగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికీ సవరణలు అనివార్యం.

More News : మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి.. దాని చరిత్ర ఇదే..

Next Story

Most Viewed