మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి.. దాని చరిత్ర ఇదే..!

by Rajesh |   ( Updated:2023-09-19 07:11:17.0  )
మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి.. దాని చరిత్ర ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ కేంద్రం మహిళా రిజర్వేషన్ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును నేడు(మంగళవారం) లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును 1996లో దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్ సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికి ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2014లో లోక్ సభ రద్దు కావడంతో అక్కడే మురిగిపోయింది. ఇక ఈ బిల్లును మోడీ సారథ్యంలో కేబినెట్ తాజాగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి?

రాజ్యాంగంలోని 108వ సవరణ బిల్లు.. 2008 రాష్ట్ర శాసనసభలు, పార్లమెంట్ లోని మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు (33%) మహిళలకు కేటాయించాలని కోరింది. 33శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు మరియు ఆంగ్లో ఇండియన్లకు సబ్ రిజర్వేషన్లను బిల్లు ప్రతిపాదిస్తుంది. రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించవచ్చు. సవరణ చట్టం అమలులోకి వచ్చిన 15 ఏళ్ల తర్వాత మహిళలకు సీట్ల రిజర్వేషన్లు నిలిచిపోతాయని బిల్లు చెబుతోంది.

మహిళా రిజర్వేషన్ల చరిత్ర..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మే 1989లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు సంకల్పించారు. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా ఎన్నికైన సంస్థల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు చేయొచ్చని భావించారు. అయితే బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది కానీ 1989 సెప్టెంబర్ లో రాజ్యసభలో ఆమోదం పొందడంలో విఫలమయింది. 1992, 1993లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహా రావు రాజ్యాంగ సవరణ బిల్లులు 72 మరియు 73లను తిరిగి ప్రవేశపెట్టారు. గ్రామీణ, పట్ణణ స్థానిక సంస్థలలో మహిళలకు అన్ని సీట్లు, చైర్ పర్సన్ పదవులలో మూడింట ఒక వంతు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోగా.. బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి.

ఈ బిల్లు కారణంగా దేశవ్యాప్తంగా పంచాయతీలు, నగరపాలికల్లో దాదాపు 15లక్షల మంది మహిళా ప్రతినిదులు ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 12, 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారిగా పార్లమెంట్‌లో మహిళల రిజర్వేషన్ కోసం 81వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంలో విఫలమయింది. దీంతో గీతాముఖర్జీ అధ్యక్షతన ఉన్న జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇది సిఫార్సు చేసింది. డిసెంబర్ 1996లో ముఖర్జీ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే లోక్ సభ రద్దుతో బిల్లు రద్దు చేయబడింది.

రెండు సంవత్సరాల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు 1998లో లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బి‌ల్లు ప్రవేశపెట్టింది. ఈ సారి కూడా బిల్లు ఆమోదం పొందలేదు. అనంతరం 1999, 2002, 2003లో వాజ్ పేయి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆమోదం పొందలేదు. ఐదేళ్ల తర్వాత 2004లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 సర్కారులో కొంత ముందడుగు పడింది. అయితే 2004లో ప్రభుత్వం తన కామన్ మినిమమ్ ప్రొగ్రామ్‌లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును చేర్చింది.

2008 మే 6న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా బిల్లులో 1996లో గీతా ముఖర్జీ కమిటీ చేసిన ఏడు సిఫార్సులను ఈ బిల్లు సంస్కరణలో చేర్చారు. ఈ చట్టాన్ని 2008 మే9న స్టాండింగ్ కమిటీ పంపారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను 17 డిసెంబర్ 2009న సమర్పించింది. ఇది ఫిబ్రవరి 2010లో కేంద్ర మంత్రి వర్గం నుండి ఆమోదం పొందింది. చివరికి ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లు లోక్‌సభలో ఎప్పుడూ పరిశీలనకు రాలేదు. చివరగా 2014లో లోక్‌సభ రద్దుతో బిల్లు ఆమోదం నిలిచిపోయింది. రాజ్యసభలో ప్రవేశపెట్టినా.. ఆమోదించినా బిల్లు ఆమోదం పొందదు.. కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. ఇక మోడీ నేతృత్వంలో ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.

Read More..

మధ్యాహ్నం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆ అంశాలపై చర్చపై ఉత్కంఠ!

Advertisement

Next Story

Most Viewed