- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG News: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. మంత్రి పదవులిస్తే విలీనానికి సై!
రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రతిపాదన మరో సారి తెరపైకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తు్న్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్‌కు చెందిన శాసన సభ్యులు కాంగ్రెస్ అధిష్ఠానానికి షరతు విధించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు.. రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు అడిగినట్లు తెలిసింది.-
న్యాయపరంగా చిక్కులు రాకుండా..
బీఆర్ఎస్‌కు చెందిన 38 మంది శాసన సభ్యుల్లో ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతున్నది. సుప్రీంకోర్టులో సైతం కేసు వేసింది. వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తయి బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి మార్గం సుగమమవుతుంది. దీంతో న్యాయపరంగా ఎక్కడా చిక్కులు రావని కాంగ్రెస్ భావిస్తున్నది. అంతే కాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయొచ్చని ఆలోచిస్తున్నది. ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడిన గులాబీ పార్టీ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారికి అభ్యర్థులు దొరకరని భావిస్తున్నది. గ్రామ స్థాయిలో ‘కారు’ పార్టీని పెలికించవచ్చనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోసారి విలీనం చర్చలు తెరపైకి వచ్చినట్లు తెలిసింది.
మరో ప్రతిపాదనతో రావాలని సూచన!
నలుగురికి మంత్రి పదవులు సాధ్యం కాదని, మరో రకమైన ప్రతిపాదనతో రావాలని విలీన వ్యవహారాన్ని డీల్ చేస్తున్న నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి ఏఐసీసీ పెద్దలు సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శాసన సభ్యుల్లో అత్యధికులు పార్టీ మారేందుకు ఆసక్తిగా ఉన్నా.. ‘కులం చెడ్డా.. ఫలం దక్కాలి’ అన్న సూత్రాన్ని వినిపిస్తున్నట్టు సమాచారం. తమకు ప్రాధాన్యమైన పోస్టులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లులు తదితర ఇవ్వాలని కొందరు షరతు పెట్టినట్లు చర్చ జరుగుతున్నది. పార్టీలో చేరాలనుకునే వారిలో గ్రేటర్‌లో ఒకరిద్దరు తప్ప అందరూ ఆసక్తిగానే ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ తర్వాత మెదక్ జిల్లాలోనే అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడి నుంచి గెలిచిన వారిని గ్రేటర్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మె్ల్యే డీల్ చేస్తునట్లు సమాచారం. అక్కడి వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారందరు ఓకే అయినట్లు తెలిసింది. హైదరాబాద్ జిల్లాలో ఒకరు మినహా మిగతా వారంతా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యేందుకు ఓకే అయినట్లు చర్చజరుగుతున్నది.
బహుముఖ వ్యూహం..
హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఇలా ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. పదవులు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. ఇలా అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకే కాంగ్రెస్ అధిష్టానం వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జిల్లాలకు ప్రాతినిధ్యం, అదే సమయంలో విలీనం ద్వారా న్యాయ సమస్యలకు చెక్ పెట్టడం, ప్రత్యర్థి పార్టీ ఆత్మ స్థైర్యం దెబ్బతీయడం, బలహీనపర్చడం.. ఇలా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లుగా సమాచారం. గతంలోనే కాంగ్రెస్‌లోకి కొందరు వచ్చేందుకు సుముఖత చూపినా.. పూర్తి స్థాయిలో చర్చలు, సంప్రదింపులు ముందుకు సాగలేదని సమాచారం. ముగ్గురు, నలుగురైతే రాహుల్ గాంధీ సమక్షంలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక.. చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లుగా సమాచారం.
ఆరుగురిని మంత్రి వర్గంలోని తీసుకునే అవకాశం
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరుగురిని మంత్రి వర్గంలోని తీసుకునే వెసులుబాటు ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతున్నా.. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముందుకు సాగడంలేదు. జిల్లాలు, కుటుంబాలు, సామాజికవర్గాలు ఇలా అన్ని రకాల లెక్కలు కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. ఆరు మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది మందిని కేబినెట్ స్థాయి పోస్టులతో సంతృప్తి పర్చవచ్చని లెక్కలు వేశారు. మంత్రివర్గంలో హోం శాఖ, మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ తదితర శాఖలకు మంత్రులు లేరు. వీటితో పాటు ఒక్కో మంత్రి దగ్గర మూడు, నాలుగు కీలక శాఖలు ఉన్నాయి. వీటిని కూడా కొత్త వారికి కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నా... ఫలించడం లేదు. చర్చలు ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం జరిగితే.. వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని సమాచారం.
మండలిలోనూ బలం పెంచుకునేలా..
బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగానే మరికొందరు ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిన్నంటినీ కైవసం చేసుకునేందుకు విలీనం ద్వారా మార్గం సుగమం అవుతుందని, దీంతో మండలిలో బీఆర్ఎస్ బలం గణనీయంగా పడిపోయి.. అక్కడ సైతం తక్కువ మంది సభ్యులు ఉంటే.. విలీనానికి సులువు అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇలా.. గతంలో జరిగిన అవమానానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.






