BIG BREAKING : తెలంగాణలో బీజేపీకి పది ఎంపీ సీట్లు పక్కా.. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

by Disha Web Desk 1 |
BIG BREAKING : తెలంగాణలో బీజేపీకి పది ఎంపీ సీట్లు పక్కా.. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
X

దిశ, వెబ్‌డెస్క్/కరీంనగర్ ప్రతినిధి : రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. అందుకు అనుగుణంగా కార్యకర్తలు, రాష్ట్ర నాయకులను ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తోంది. ఇవాళ కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజలను కలిస్తే కుటుంబ సభ్యులను కలిసినట్లుగా ఉంటుందన్నారు. నన్ను అందరూ మేనమామ అని పిలుస్తారని తెలిపారు.

కరీంనగర్ గురించి దేశమంతా చర్చించుకునేలా చేసిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అని కొనియాడారు. తెలంగాణలో బీజేపీ 10 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ హిస్టరీలో ఇంత వరకు రాష్ట్రమంటతా పాదయాత్ర చేసిన ఘనుడు ఎవ్వరూ లేదని కొనియాడారు. ఈసారి కరీంనగర్ నుంచి పోటీలో ఉంటున్న బండి సంజయ్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో తొలి విజయం కరీంనగర్ నుంచి వచ్చేలా వ్యూహాలకు పదును పెట్టాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అటు గల్లీలోనూ.. ఇటు ఢిల్లీలోనూ లేదని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ కనుమరుగైందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించనంత మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్రాంతంగా పని చేస్తున్నారని తెలిపారు.

ఆర్ధిక ప్రగతిలో ప్రపంచంలోనే భారత్ 5వ స్థానానికి చేరిందన్నారు. త్వరలోనే అగ్రభాగాన భారత్‌ను నిలిపి విశ్వగురుగా మార్చబోతున్నారని స్పష్టం చేశారు. ఈనెల 22న దేశమంతా రామమయం కాబోతోందని, దివ్య భవ్యమైన రామ మందిరంలో రాముడిని పున:ప్రతిష్ట చేసుకోబోతున్నామని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ లాంటి పోరాట యోధుడిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14 శాతం పైగా ఓట్లు వచ్చాయని, ఒక్క సీటు నుంచి 8 ఎమ్మెల్యే సీట్లను తెలంగాణ ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. సంకల్పముంటే సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.




Next Story

Most Viewed