బైంసా టు గాంధీ భవన్ కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర

by Disha Web Desk 12 |
బైంసా టు గాంధీ భవన్ కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల కోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అందులో భాగంగానే ‘తెలంగాణ పోరు’ పేరుతో కాంగ్రెస్ మరో యాత్ర చేపట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ పేరిట ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్​జిల్లాలను అనుసంధానిస్తూ పాదయాత్ర కొనసాగుతున్నది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మార్చి 3 నుంచి తెలంగాణ పోరు యాత్రను భైంసా నుంచి హైదరాబాద్ లోని గాంధీ భవన్ వరకు నిర్వహించనున్నారు. అంతకు ముందు బాసరలో పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీపీసీసీ నిర్ణయం తీసుకున్నది.

ఈ యాత్రలో రాష్ట్ర ముఖ్య నాయకులంతా పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నది. ప్రతి నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో కనీసం రెండు రోజుల పాటు యాత్ర చేయాలని నేతల అభిప్రాయం. ఈ యాత్రకు పార్టీ హైకమాండ్​నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ రావడంతో నేతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ఆధ్వర్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్ర హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో ముగుస్తున్నందన ఆ రోజు ఢిల్లీ నుంచి ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.

ప్రత్యేక భేటీ

ప్రస్తుతం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న హాథ్ ​సే హాథ్ ​పాదయాత్రలో సీనియర్లు పాల్గొనడం లేదు. కొందరు పాల్గొన్నప్పటికీ అంతర్గతంగా అసంతృప్తితోనే ఉన్నట్లు ఆఫ్ ది రికార్డుగా పలువురు నేతలు చెబుతున్నారు. పార్టీ బలోపేతం కోసం నేతలంతా కలిసి నడవాలని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ థాక్రే నొక్కి చెప్పడంతో సీనియర్లంతా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు గాంధీభవన్​వర్గాలు చెబుతున్నాయి.

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​మహేశ్వర్​రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్​రాజనర్సింహా ఆధ్వర్యంలో ఈ యాత్ర ప్రారంభం కానున్నది. ఇప్పటికే యాత్రలో పాల్గొనే లీడర్లు ప్రత్యేకంగా భేటీ కూడా అయినట్టు సమాచారం. హాథ్​ సే హాథ్ యాత్రను 60 రోజుల పాటు నిర్వహించాల్సి ఉన్నందున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఈ యాత్రలో పాల్గొనే చాన్స్​ తక్కువేనని గాంధీభవన్ ​వర్గాలు తెలిపాయి.

హాథ్ సే హాథ్‌ యాత్రకు కంటిన్యూగా..

యాత్ర విషయంపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​మహేశ్వర్​రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్నదని, దానికి కంటిన్యూగానే తెలంగాణ పోరు యాత్రను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. తొలి విడత 10 రోజుల పాటు నిర్వహించి, ఆ తర్వాత అన్ని నియోజకవర్గాలు టచ్​అయ్యేలా యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలతో పార్టీలో నూతనోత్సహం వస్తుందన్నారు. కార్యకర్తల్లో మనోధైర్యం పెరిగిందని, అతి త్వరలోనే కాంగ్రెస్​అధికారంలోకి రాబోతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పోరు యాత్రకు నేతలంతా సహకరించాలని ఆయన కోరారు.


Next Story

Most Viewed