జర జాగ్రత్త.. మరో మూడు రోజులపాటు మండనున్న ఎండలు

by Disha Web Desk 21 |
temperatures
X

దిశ, సిటీబ్యూరో : మండుతున్న ఎండలతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. రానున్న మూడు రోజుల పాటు ఎండలు మరింత మండే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిన నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. మండుతున్న ఎండల కారణంగా మధ్యాహ్నాం సమయంలో నిత్యం రద్దీగా ఉండే పలు మెయిన్ రోడ్లలో రాకపోకలు పలుచబడి పోతున్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఆఫీసులు, ఇళ్లలోనూ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరగటంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఎండలోనే రాకపోకలు సాగించాల్సిన వారు ఎండ, వేడి గాలి బారిన పడుకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు శీతల పానీయాలను సేవిస్తున్నారు. మహానగరంలోని పలు టూరిజం పాయింట్ల వద్ద రోడ్డుకిరువైపులా పుదీనా జూస్, చెరుకు రసం, బటర్ మిల్క్, కూల్ డ్రింక్‌లను విక్రయించే షాపులు పెరిగాయి. గడిచిన మూడు రోజులుగా నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలను గమనిస్తే పక్షం రోజుల ముందున్న పరిస్థితులు కాస్త మెరుగయ్యాయనే చెప్పవచ్చు. ఈ నెల 4న గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యాయి. 5న గరిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గి నమోదైనప్పటికీ కనిష్ట ఉష్ణోగ్రత యథావిధిగా నమోదయ్యాయి. మంగళవారం నాటి ఉష్ణ్రోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత మళ్లీ 38 డిగ్రీలుగా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగి 29 డిగ్రీలుగా నమోదైంది. ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం.

మధ్యాహ్నం అంతా నిర్మానుష్యం..

ఉదయం పదకొండు గంటల నుంచి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మధ్యాహ్నం పూట ఎవరు బయటకు వచ్చేందుకు సాహసించటం లేదు. ముఖ్యంగా పాదచారులు మధ్యాహ్నం పెరిగిన టెంపరేచర్‌తో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో బయట రాకపోకలు సాగించే వారు తలకు, ముఖానికి గుడ్డలు కట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లన్ని పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాకపోకల్లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి.


Next Story

Most Viewed