శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్?

by Disha Web Desk 2 |
శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకకు రంగం సిద్ధమైంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్‌ను నియమించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీనియర్ నేతలు కడియం శ్రీహరి, మధుసూధనాచారి, ఎల్. రమణ పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి 2021 జూన్ 3తో ఖాళీ ఏర్పడింది. డిప్యూటీ చైర్మన్‌‌గా వ్యవహరిస్తున్న నేతి విద్యాసాగర్‌ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో ఎవరిని నియమించలేదు. గత 20 నెలలుగా ప్రభుత్వం భర్తీ చేయలేదు. మండలిలో పూర్తిస్థాయి బలం ఉన్నప్పటికీ డిప్యూటీ చైర్మన్ నియామకాన్ని మాత్రం పెండింగ్‌లోనే పెట్టింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు ముదిరాజ్ కులానికి చెందిన బండా ప్రకాశ్‌ను రాజ్యసభకు రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా నియమించారు. మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది.

పార్టీలో సైతం అదే చర్చ జరిగింది. కానీ మంత్రి మండలిలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయలేదు. ముదిరాజ్ కులస్తులు బీఆర్ఎస్ వెంటే ఉండేలా మరో పక్క మండలి డిప్యూటీ చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. కానీ నియామకం జరగలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో డిప్యూటీ చైర్మన్ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఒక వేళ ఆదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే వ్యతిరేక ఆ కులస్తుల్లో వచ్చే అవకాశం ఉందని పార్టీ గ్రహించినట్లు తెలిసింది. అయితే ఏ రోజు నోటిఫికేషన్ ఇస్తారనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు. సమావేశాలు ప్రారంభమైన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరో ముగ్గురి పేర్లు పరిశీలన

పార్టీలో సీనియర్లుగా వ్యవహరిస్తున్న మరో ముగ్గురి పేర్లను సైతం పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారితో పాటు ఎల్‌. రమణ పేరును సైతం పరిశీలిస్తున్నారు. అయితే వారి సొంత నియోజకవర్గాల్లో వీరికి పట్టుండటంతో ఎమ్మెల్యే బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఇప్పటికే కడియం, మధుసూదనాచారిల కు చెందిన వర్గీయులు నియోజకవర్గాల్లో యాక్టీవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే మండలిలో ఒక చీప్ విప్, రెండు విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవులకు సైతం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎవరికి ఇస్తే వారికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వరనే ప్రచారం సైతం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ డిప్యూటీ చైర్మన్ ఖాళీని మాత్రమే భర్తీ చేస్తారా? లేకుంటే ఖాళీగా ఉన్న చీప్ విప్, రెండు విప్ పదవులను సైతం నియమిస్తారా? అనేది పార్టీలో చర్చనీయాంశమైంది.

Next Story