కాళేశ్వరం ముంపు బాధితులను ఆదుకోండి.. పీఎంఓలో దరఖాస్తు

by Disha Web Desk 2 |
కాళేశ్వరం ముంపు బాధితులను ఆదుకోండి.. పీఎంఓలో దరఖాస్తు
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని మంథని మాజీ ఉప సర్పంచ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయంలో వినతి చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని కాళేశ్వరం ప్రాజెక్టు బాధిత రైతులను, బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని గోదావరి నదిపై నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్ అధికారుల తప్పిదాలు జరిగాయన్నారు. అన్నారం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు కారణంగా పెద్దపల్లి జిల్లాలోని మంథని మున్సిపల్ పరిధితో పాటు మంథని మండలంలోని సిరిపురం, బెస్తపల్లి, చిల్లపల్లి, పోతారం, ఆరెంద, వెంకటాపూర్, ఖాన్ సాయిపేట, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట, అన్నారం, మేడిగడ్డ బ్యాక్ వాటర్‌తో సూరారం, బెగ్లూరు, బొమ్మాపూర్, మహదేవపూర్, ఏడపల్లి, కుదురుపల్లి, బీరసాగర్, కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లోని పరివాహక గ్రామాలు, పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల్లోని వ్యవసాయ భూములు ఏటా ముంపునకు గురవుతున్నాయని సతీష్ ఆ ఫిర్యాదులో వివరించారు.

ఈ సారి వచ్చిన వరదలో కారణంగా పంటలతో పాటు ఇండ్లు కూడా వరద నీటిలో మునిగిపోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. అయితే భద్రాచలం ప్రాంతంలోని వరద బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాంతాలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో బ్యాక్ వాటర్ కారణంగా తరుచూ ముంపునకు గురవుతున్న ప్రాంతాల రైతులకు పరిహారం ఇప్పించాలని, ప్రాజెక్టు నిర్మాణంతో మునకకు గురైన భూములను కూడా సేకరించి పునరావాసం కల్పించాలని ఇనుముల సతీష్ కోరారు. భద్రాచలం వరద బాధితులకు చెల్లించినట్టుగానే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని వరద బాధితులకు కూడా వరద సాయం అందించేందుకు చొరవ చూపించాలన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ కరకట్టల నిర్మాణం జరిపి రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన పర్యవరణ నష్టంపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలచే విచారణ జరిపించాలని సతీస్ పీఎంఓ కార్యాలయంలో ఇచ్చిన దరఖాస్తులో కోరారు.



Next Story