హైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం.. 18 వందల మందికి ఉద్యోగాలు!

by Disha Web Desk 2 |
హైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం.. 18 వందల మందికి ఉద్యోగాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్మా, గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ కేంద్ర రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ 'గ్లోబల్ క్యాపిబిలిటీ' కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్‌ని అందించనున్నట్లు తెలిపింది. ఈ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారిగా వీరి సంఖ్యను 1800 పెంచనున్నట్లు సంస్థ ప్రకటించింది. మంగళవారం శాండోస్ కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్‌తో కూడిన ప్రతినిధి బృందం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్లు ప్రకటించింది. సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపార అనుకూలత, అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్ సైన్సెస్ రంగం మరింతగా వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న భవిష్యత్తు ప్రణాళికల పైన కంపెనీ ప్రతినిధి బృందానికి వివరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మసిటీ గురించి వివరాలు అందజేశారు, సాండోస్ లాంటి కంపెనీకి ఫార్మాసిటీ అద్భుతమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంటుందని పేర్కొన్నారు. కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కంపెనీకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ విస్తరణ, తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని కంపెనీ ప్రతినిధి బృందం వ్యక్తం చేసింది.


Next Story

Most Viewed