మరో 24 గంటలు.. సిటీకి కొనసాగుతున్న రెడ్ అలర్ట్

by Disha Web Desk 4 |
మరో 24 గంటలు.. సిటీకి కొనసాగుతున్న రెడ్ అలర్ట్
X

దిశ, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరానికి రానున్న మరో 24 గంటలపాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం కూడా నగరంలో ఓ మోస్తారు నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ సూచించింది. శుక్రవారం మధ్యాహ్నం ఓ మోస్తారుగా వర్షం కురుస్తూ సాయంత్రాని కల్లా మామూలు వాతావరణం నెలకొనే అవకాశముందని వెల్లడించింది. క్రమంగా ఉపరితల ఆవర్తనం బలహీనపడటంతో శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం కల్లా మామూలు వాతావరణం నెలకొనే అవకాశాలున్నట్లు వెల్లడించింది.

ఎగువ నుంచి హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరటంతో గరిష్ట నీటిమట్టాన్ని దాటి నీరు చేరింది. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లను దాటి, ప్రస్తుత నీటిమట్టం 513.65కు చేరటంతో ఇప్పటికే దిగువ ప్రాంతాల ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అవసరమైతే పరివాహక ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉన్న స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని జీహెచ్ఎంసీ సిద్దంగా ఉంది.

రిలీఫ్ సెంటర్లు సిద్దం..

- జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా ఇప్పటికే 130 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ గురువారం తెలిపారు. ముందు జాగ్రత్తగా వర్షాలు మొదలైనప్పుడే, వాతావరణశాఖ అలర్ట్‌తో రిలీఫ్ సెంటర్ల కోసం సర్కారు భవనాలు, జీహెచ్ఎంసీ ఆఫీసులను గుర్తించి సిద్దంగా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

12 గంటలు..66 ఫిర్యాదులు..

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం)కు 66 ఫిర్యాదులు అందినట్లు డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వీటిలో వాటర్ స్టాగినేషన్‌కు సంబంధించిన ఫిర్యాదులు 28, ట్రీ ఫాల్ 35, యానిమల్ రెస్క్యూ 1, గోడలు కూలినవి 2 ఉన్నట్లు, వీటిలో 49 ఫిర్యాదులను పరిష్కరించినట్లు, మిగిలిన 17 ఫిర్యాదుల పరిష్కారం వివిధ దశల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.

Also Read: నేడు అతిభారీ వర్ష సూచన.. ఆ జిల్లాల వారికి కీలక హెచ్చరిక

Next Story

Most Viewed