మీడియా అకాడమీ చైర్మన్‌గా ‘ఆంధ్రజ్యోతి’ శ్రీనివాస్?

by Disha Web Desk 2 |
మీడియా అకాడమీ చైర్మన్‌గా ‘ఆంధ్రజ్యోతి’ శ్రీనివాస్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్ సంపాదకులు కే.శ్రీనివాస్‌ను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పడం సముచితంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వివాదరహితుడు మాత్రమే కాక జర్నలిజంలో ఉన్న సుదీర్ఘ అనుభవం, ప్రజాస్వామ్యాన్ని బలంగా కోరుకునే వ్యక్తిత్వం, జర్నలిస్టులను కలుపుకుపోయే మనస్తత్వం.. ఇలాంటి అనేక పాజిటివ్ అంశాలతో ఆయన పరు పరిశీలనలో ఉన్నది. ఈ బాధ్యతలకు ఆయన అర్హులనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మీడియా అకాడమీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉండడంతో త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం కావొచ్చని సమాచారం.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో స్పష్టమైన హామీలు ఇచ్చినందున వాటిని అమలు చేయడానికి వీలుగా వీలైనంత తొందరగా ఈ పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వ ఆలోచనలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారా?.. లేదా?.. అనేది ఇంకా బహిర్గతం కాలదు. ప్రొఫెషనల్‌గా తన మనసులోని భావాన్ని సూటిగా వ్యక్తం చేయడం, ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండడం, రాజీలేని ధోరణి ఇవన్నీ ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కార్పొరేషన్ల నియామకాలను ప్రధాన కార్యదర్శి రద్దు చేయడంతో మీడియా అకాడమీకి సైతం కొత్త చైర్మన్‌ను నియమించాల్సి వస్తున్నది.

ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన వెలువడనున్నది. ఈ పోస్టు కోసం మరికొందరు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నా చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఆఫర్‌కు కే.శ్రీనివాస్ సమ్మతిస్తారా?.. ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ నుంచి బైటకు రావడానికి సిద్ధపడతారా?.. యాజమాన్యం ఆయనను వదులుకోడానికి అంగీకరిస్తుందా?.. ఇలాంటి పలు సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడడం మొదలు నియామక ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ పోస్టు భర్తీ ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరం.

Next Story

Most Viewed