ఇన్నాళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాం.. ఒకేరోజు 4 పరీక్షలు పెడితే ఎట్ల?

by Disha Web Desk 2 |
ఇన్నాళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాం.. ఒకేరోజు 4 పరీక్షలు పెడితే ఎట్ల?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘సంవత్సరాల పాటు కష్టపడ్డాం, నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచిచూశాం. హమ్మయ్య చిట్టచివరకు నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నాం.. తీరా చూస్తే ఒకే రోజు 4 పరీక్షలు. ఎలా రాయాలి? ఏ పరీక్ష రాయాలి?’ ఇది ప్రస్తుతం నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన. ఈనెల 30వ తేదీన నాలుగు పోటీ పరీక్షలున్నాయి. కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ లైన్ మెన్ పరీక్షలు.. ఇలా నాలుగు పరీక్షలు ఒకే రోజు ఉండడంతో ఏ పరీక్ష రాయాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అన్ని పరీక్షలు ఒకే అర్హతతో కూడినవని, దీంతో అప్లై చేసుకున్న వారికి తీవ్ర నష్టం కలుగుతుందని అభ్యర్థులు వాపోతున్నారు.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, వేర్వేరు రోజుల్లో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనపై ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏ పరీక్ష రాయాలి, వేటిని వదులుకోవాలో తెలియక నిరుద్యోగ అభ్యర్థులు కలవరపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కలగచేసుకుని ఈ నాలుగు పరీక్షలను నాలుగు వేరే వేరే తేదీలలో నిర్వహించేలా చూడాలని, అభ్యర్థులకు కనీసం ఈ మాత్రం సహాయం అయినా చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, సీఎస్ శాంతి కుమారి కూడా స్పందించాలని కోరారు.




Next Story

Most Viewed