విద్యార్థుల్లో మార్పు కోసం.. యజ్ఞంలా అక్షర దీక్ష

by Disha Web Desk 4 |
విద్యార్థుల్లో మార్పు కోసం.. యజ్ఞంలా అక్షర దీక్ష
X

దిశ, ప్రతినిధి వనపర్తి: అయ్యప్ప స్వామి దీక్ష, శివదీక్ష, ఆంజనేయ స్వామి మాల ధారణ వంటివి తరచూ మనం వింటున్నాం.. చూస్తున్నాం. కానీ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులలో మార్పు కోసం ఉపాధ్యాయులు సరికొత్తగా చేపట్టిన అక్షర దీక్ష ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. ఈ దీక్ష చేపట్టిన కొన్నాళ్లకే విద్యార్థుల్లో వస్తున్న మార్పులను చూసి వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తుండగా మేధావి వర్గం ప్రశంసలు కురిపిస్తుంది.

క్రమశిక్షణ అలవర్చాలనే...

తరగతులకు సక్రమంగా హాజరు కాకుండా అల్లరి చిల్లరగా తిరిగే విద్యార్థులు... ఉపాధ్యాయుల ముందే తగవులాడుకోవడం... అసభ్యకర పదజాలాంతో దూషించుకోవడం... పెద్దలంటే గౌరవించకపోవడం వంటివి మొన్నటి వరకు ఆ పాఠశాలలో కనిపించిన దృశ్యాలు. గ్రామస్తులందరూ చులకనగా చూసే వారు.

ఇదంతా వనపర్తి జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో 168 మంది విద్యార్థులు ఉన్న మనిగిల్ల ఉన్నత పాఠశాల దుస్థితి. అయితే ఇదంతా చూసిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ విద్యార్థులను గాడిలో పెట్టాలని తన సహచర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం అయ్యారు.

సమాజంలో చాలా మంది తమ ఇష్టదైవాల పేరిట దీక్షలు చేపట్టడం ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, దీక్ష పూర్తయ్యే వరకు కఠిన నియమాలను ఆచరించడం, అందరి పట్ల గౌరవంగా ఉండడం వంటివి గురించి చర్చించారు. విద్యార్థులలో సైతం సమూలంగా మార్పులు తీసుకొచ్చి సన్మార్గంలో నడపాలంటే ఇలాంటి దీక్ష ఒకటి చేపట్టాలని ఆలోచించారు. దీనిలో భాగంగానే అక్షర దీక్ష అనే కార్యక్రమాన్ని రూపొందించారు.

41 రోజులపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు దీక్ష చేపట్టి నిజాయితీగా, ఉండడం సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణ కలిగి ఉండి తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం, తోటి వారితో స్నేహంగా మెలగడం వంటి నియమాలను ఆచరించాలని నిర్ణయించుకున్నారు. దీనికి తల్లిదండ్రులు సంపూర్ణంగా ఆమోదం తెలుపగా విద్యార్థులు సైతం సై అన్నారు. దీంతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మనిగిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అక్షర దీక్ష చేపట్టారు.

పాఠశాల అధ్యాపక బృందం కొన్ని నియమ నిబంధన రూపొందించి ప్రత్యేకంగా తయారు చేయించిన అక్షర దీక్ష లోగోను మెడలో వేసి విద్యార్థులందరితో ప్రమాణం చేయించి దీక్షను మొదలుపెట్టించారు. ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని పది నిమిషాలు యోగ ధ్యానం చేయాలి.

అనంతరం పాఠ్యపుస్తకం చదువుకోవడం, తర్వాత తల్లిదండ్రులకు ఇంటి పనుల్లో సహాయం అందించడం, త్వరగా ముస్తాబయి తల్లిదండ్రుల పాదాభివందనం చేసి పాఠశాలకు రావాల్సి ఉంటుంది. పాఠశాలలో సైతం తోటి విద్యార్థులతో స్నేహంగా ఉండడం, ఎలాంటి తగాదాలు పెట్టుకోకుండా సాధ్యమైనంతవరకు నిశ్శబ్దంగా ఉండి చదువుకోవడం చేయాల్సి ఉంటుంది.

సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి హోంవర్క్ పూర్తి చేసి మళ్లీ చదువుకోవడం అనంతరం ఆరోజు దినచర్య గురించి డైరీలో రాయడం వంటివి చేస్తారు. ఒకవేళ ఆరోజు తాము ఏమైనా అబద్ధాలు మాట్లాడినా, ఆలస్యంగా నిద్ర లేచినా వాటి గురించి డైరీలో నిజాయితీగా రాయాలి. మరొకసారి ఇలాంటి తప్పు చేయమని హామీ ఇవ్వడం చేస్తున్నారు. అంతే కాకుండా బయట దొరికే తినుబండారాలను తగ్గించడం, డబ్బులు పొదుపు చేయడం వంటివి దీక్షలో ఒక భాగం.

విద్యార్థుల బ్యాంకు పేరిట ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ఖాతాలలో తమ డబ్బులను జమ చేసుకోవడం చేస్తున్నారు మొన్నటి వరకు క్రమశిక్షణ లేని ఆ పాఠశాల విద్యార్థులు అక్షర దీక్ష చేపట్టి నేడు జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారు. చక్కటి ప్రవర్తన, క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం, ప్రతిరోజూ తల్లి తండ్రులకు పాదాభివందనం చేయడం, తోటి వారితో స్నేహంగా మెలగడం వంటి అలవాట్లతో అందరితో ప్రశంసలు పొందుతున్నారు.

స్పందిస్తున్న దాతలు...

పాఠశాల విద్యార్థులలో సమూల మార్పులు తీసుకురావడానికి వారికి క్రమశిక్షణ అలవర్చడానికి ఉపాధ్యాయులు రూపొందించిన అక్షర దీక్ష కార్యక్రమాన్ని చూసి పలువురు దాతలు పాఠశాల అభివృద్ధి కోసం సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ మాసం ముఖ్య అతిథి పేరుతో పాఠశాల పూర్వ విద్యార్థులను పిలిచి గౌరవించడం వంటి కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి బాల్ రెడ్డి ఒకరోజు అతిథిగా పాఠశాలకు హాజరయ్యారు.

అక్కడ పరిస్థితులు చూసి తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలని సంకల్పించి రెండున్నర లక్షల రూపాయలతో 10 కంప్యూటర్లను పాఠశాలకు అందించారు. దీంతో ఓ ప్రత్యేక గదిలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఫొటోషాప్ వర్క్ తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని బోధిస్తున్నారు.

తమ సొంత ఆలోచనలతో కంప్యూటర్లపై ప్రయోగాలు చేయడంతో పాటు పాఠశాల నమూనా, గ్రామంలోని దేవాలయ నమూనాను అట్టముక్కలతో రూపొందించి పాఠశాలలో ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థులలో వస్తున్న మార్పులను చూసి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహకులు చిన్నమ్మ థామస్ అక్షర దీక్ష పూర్తయ్యే వరకు ప్రతిరోజూ విద్యార్థులందరికి పాఠశాలలోనే అల్పాహారం ఏర్పాటు చేశారు.

విద్యార్థులలో ఎంతో మార్పు వస్తోంది...

పలుస శంకర్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు, మనిగిల్ల ఉన్నత పాఠశాల,వనపర్తి జిల్లా

విద్యార్థులను సన్మార్గంలో నడిపించడానికి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అక్షర దీక్ష అనే కార్యక్రమం రూపొందించి ఓ యజ్ఞంలా మొదలుపెట్టాం. ఇది ఎంతో సత్ఫలితాలను ఇవ్వడంతో పాటు విద్యార్థుల్లో సమూలంగా మార్పులు తీసుకొస్తోంది. ప్రతిరోజు విద్యార్థుల డైరీలను పరిశీలించి తగిన సూచనలు చేయడం, ఫ్రెండ్లీ టీచింగ్ అమలు చేయడం చేస్తున్నాం. విద్యార్థుల అబద్దాలు చెప్పకుండా నిజాయితీగా ఉండడం, పెద్దలను గౌరవించడం చూస్తే అక్షర దీక్ష విజయవంతం అయిందని భావిస్తున్నాం.

మా తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు...

పి.షర్మిల, పదవ తరగతి విద్యార్థిని, మనగిళ్ల పాఠశాల

నేను అక్షర దీక్ష చేపట్టి 21 రోజులు గడిచింది. నా దినచర్యలో ఎన్నో మార్పులు చేసుకున్నాను. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ధ్యానం చేయడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం చేస్తాను. పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడం, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చదువుకొని, హోమ్ వర్క్ చేయడం చూసి మా తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారు.

Next Story

Most Viewed