ఆ సీఎంతోనే క్షమాపణలు చెప్పించుకున్నాం.. అక్బరుద్దీన్​ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
ఆ సీఎంతోనే క్షమాపణలు చెప్పించుకున్నాం.. అక్బరుద్దీన్​ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, చార్మినార్​: ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం లేదని చార్మినార్​శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డికి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ సవాల్ విసిరాడు. ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కాంగ్రెస్​ నాయకుల మాటలపై చాంద్రాయణగుట్ట నియోజకవర్గ ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ ఘాటుగా స్పందించారు. పాతబస్తీ బండ్లగూడలో సాలారే మిల్లత్​ఎడ్యుకేషనల్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీ టు పీజీ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్​ క్యాంపస్‌ను గురువారం రాత్రి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, సాలారే మిల్లత్​ఎడ్యుకేషనల్ ట్రస్ట్​వ్యవస్థాపక చైర్మన్​ అక్బరుద్దీన్ ఓవైసీ అట్టహాసంగా ప్రారంభించారు.

నేను మహారాష్ట్ర నుంచి వచ్చానంటారా? నేను.. మానాన్న.. మాతాత.. ముత్తాత అందరం భారతదేశంలోనే పుట్టాం. మరి రాహుల్​గాంధీ తల్లి సోనియాగాంధీ ఎక్కడ పుట్టిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్​ ఓవైసీ మాట్లాడుతుంటే మంచి మంచోళ్ల నోళ్లు మూసుకుపోతాయన్నారు. ఓవైసీ దేశంలోని పార్లమెంట్ లో మాట్లాడినా జాతీయ నాయకులతో పాటు చాయ్​ వాలా అయినా మరో గాంధీ అయినా సరే మా మాటలకు తిరుగుఉండదన్నారు. మేము సేవా కార్యక్రమాలల్లో బిజీగా ఉన్నామని, మేము ఎవరిని కించపరచడం లేదన్నారు.

మమ్మల్ని కించపరిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ, సంఘ్​పరివార్, ఆర్ఎస్ఎస్, శివసేన పార్టీలు ముస్లింలకు శత్రువులు అన్నారు. ముఖ్యమంత్రి పీఠం మీద రెడ్డి, బాబు, రావు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో పనిచేయించుకునే జిమ్మిక్కులు మా దగ్గర ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌లో చివరి సీఎం కిరణ్ కుమార్​ బీజేపీలోకి వచ్చాడని అప్పట్లో కిరణ్​కుమార్‌తోనే క్షమాపణ చెప్పించుకున్నాన్నారు. పాములోడు నాద స్వరం ఊదితే పాములు ఎలా ఆడుతాయో... నేను మాట్లడడం మొదలు పెడితే ప్రతి ఒక్కరు నృత్యం చేయాల్సిందేనన్నారు. తప్పకుండా మా మాటకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. దేశంలో ఒకప్పుడు ముస్లింలపై అరాచకాలు చేసేవారని, గడ్డం, నెత్తిపై టోపీ ఉంటే కొట్టేవారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ ఉన్నందునే ముస్లింలపై నేడు కన్నెత్తి చూడడం లేదన్నారు. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో దేశ వ్యాప్తంగా ఇంకెవరయినా ఇలాంటి పనులు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. హిందూ, సిక్కు, క్రైస్తవులకు మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదన్నారు. అన్ని మతాల వారికి దారుసలాం దర్వాజాలు తెరిచే ఉంటాయన్నారు. నా కష్టార్జితంతో కట్టిన ఈ కేజీ టూ పీజీ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌ను తాను ప్రజల పార్టీ మజ్లిస్‌కు సమర్పిస్తున్నాన్నారు.

మా తాత ముత్తాతల నుండి రాజకీయం చేస్తున్నామని, ఇప్పుడు మూడో తరం అంటే మా తాత ఫక్రే మిల్లత్ వహీద్ ఓవైసీ అనంతరం సాలర్ ఏ మిల్లత్​సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఇప్పుడు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ నడిపిస్తున్నారన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన లేజర్ షో పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. లేజర్‌షోతో పాటు పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. అంతకుముందు బండ్లగూడ నుంచి క్యాంపస్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాషాఖాద్రి, మోజం ఖాన్​, అహ్మద్​బలాల, కౌసర్​ మొయినుద్దీన్‌, మెరాజ్​హుస్సేన్‌, ఎమ్మెల్సీ రహమత్​బేగ్‌, గోల్డి, కార్పొరేటర్లు ఫహద్​బిన్ అబ్దాద్, సలీం బేగ్, సమద్​బిన్​అబ్దాద్​తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed