Kaleswaram Report: అసెంబ్లీలో చర్చించాకే చర్యలు.. కేసీఆర్, హరీశ్ పిటిషన్లపై హైకోర్టుకు సర్కార్

by Prasad Jukanti |   (  Updated:2025-08-22 07:05:38  IST  )

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో తదుపరి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని హైకోర్టుకు వివరించింది.

Kaleswaram Report: అసెంబ్లీలో చర్చించాకే చర్యలు.. కేసీఆర్, హరీశ్ పిటిషన్లపై హైకోర్టుకు సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన బ్యారేజీల విషయంలో అవకతవకలపై జస్టిస్ పి.సి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక సవాల్ చేస్తూ వీరిద్దరూ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే వెంటనే దాన్ని తొలగించాలని ఆదేశించింది. పిటిషన్లపై విచారణ ముగియడంతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

అసెంబ్లీలో చర్చించాకే చర్యలు:

జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై తొలుత అసెంబ్లీలో చర్చించాకే ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాపీ రూపంలో ఏజీ ఎ.సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. కేసీఆర్, హరీశ్ రావు ఎమ్మెల్యేలుగా ఉన్నందునా అసెంబ్లీలో ప్రవేశపెట్టాకే చర్యలు తీసుకుంటామని ఏజీ కోర్టుకు తెలిపారు. నిన్న జరిగిన విచారణ సందర్భంగా కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీ చర్చించాక చర్యలు మొదలు పెడతారా లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధిం అసెంబ్లీలో చర్చిస్తా అని స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏజీ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు వెల్లడించారు.

8బీ నోటీస్ కాకుండా సెక్షన్ 5(1) నోటీస్ ఎందుకు ఇచ్చారు?:

కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రి నాయుడు, హరీశ్ రావు తరఫున ఆర్యమ సుందరం, కమిషన్ దరఫున ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ధర్మాసనం ముందు హరీశ్ రావు తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. మొత్తం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నివేదికను అడ్డం పెట్టుకుని మాపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందువల్ల ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నామన్నారు. నివేదికను సభలో ప్రవేశపెట్టడానికంటే ముందే మీడియాకు ఇచ్చి మా పరువు భంగం కలిగించారంటూ వాదించారు. అసెంబ్లీలో నివేదికను పెట్టి మా పరువు అప్రతిష్టపాలు చేస్తారని అసెంబ్లీ నిర్వహణకు ఇంకా 6 నెలల సమయం ఉందని కోర్టు కు వివరించారు. దీంతో విచారణ సందర్భంగా 8బీ నోటీస్ కాకుండా సెక్షన్ 5(1) నోటీస్ ఎందుకు ఇచ్చారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. దీంతో మేం ఇచ్చిన నోటీసు 8(బి) లాంటిదే అని ఏజీ ధర్మాసనానికి వివరించారు.

Read More: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు చుక్కెదురు .. స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం

Next Story