బెజ్జూర్ లో వెలుగులోకి వచ్చిన లేబర్ ఇన్సూరెన్స్ కుంభకోణం

by Disha Web Desk 1 |
బెజ్జూర్ లో వెలుగులోకి వచ్చిన లేబర్ ఇన్సూరెన్స్ కుంభకోణం
X

దిశ, బెజ్జూర్: లేబర్ ఇన్సూరెన్స్ పై కొంత మంది అక్రమార్కుల కన్ను పడింది. కార్మికుడు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి ఇన్సూరెన్స్ డబ్బులను కాజేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రానికి చెందిన కోట రాజన్న అనే తాపీ మేస్త్రి ఐడీ నెం.609117. 2018 సంవత్సరంలో లేబర్ ఇన్సూరెన్స్ చేసుకున్నాడు.

సదరు వ్యక్తి ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయడానికి మీ సేవకు వెళ్లగా, అతని పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు క్లెయిమ్ అయినట్లుగా చూపించడంతో బాధితుడు అవక్కయ్యాడు. తాను బతికుండగానే చనిపోయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, ఇన్సూరెన్స్ కాజేసినట్లు బాధితుడు తెలిపాడు. అందుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని లేబర్ అధికారులను పలుమార్లు అడిగినా.. అధికారులు తిప్పించుకుంటున్నారని వాపోయాడు. దీంతో సంబంధిత అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే సోమవారం బాధితుడు కోట రాజన్న కాగజ్ నగర్ లేబర్ కార్యాలయానికి వెళ్లి తన ఇన్సూరెన్స్ కే సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగాడు. దీంతో అధికారులు తప్పించుకునే ధోరణిలో ఉన్నారు. తాను బతికుండగానే మరణించినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, తన ఇన్సూరెన్స్ డబ్బు కాజేసిన వారి వివరాలు ఇవ్వాలని లేబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ డబ్బు కాజేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు.



Next Story

Most Viewed