జోరుగా బ్రాండెడ్‌ బియ్యం దందా

by Disha Web Desk 12 |
జోరుగా బ్రాండెడ్‌ బియ్యం దందా
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: మీరు రంగుల సంచుల్లో ఉన్నవి చూసి నాణ్యమైన బియ్యం అని భ్రమ ప‌డుతున్నారా..? అవే మంచి బియ్యం అని అనుకుంటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆలోచించండి.. ప్యాకింగ్‌లు చూసి మోసపోకండి. అందులో ఉండేవి సాధారణ బియ్యమే. గుడ్డిగా నమ్మి వాటిని కొనుగోలు చేస్తే మోసపోక తప్పదు. వాటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి ఉండదు. రైస్‌మిల్లులో వడ్ల నుంచి వేరు చేసిన వాటినే ప్యాక్‌ చేసి దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసినట్లు నమ్మిస్తున్నారు. నాణ్యత పేర్లు తగిలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. మంచిర్యాల‌, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల‌తో పాటు చెన్నూరు, మంచిర్యాల‌, కాగ‌జ్‌న‌గ‌ర్‌, బెల్లంప‌ల్లితో మండ‌ల కేంద్రాల్లో తరహా మోసం జరుగుతోంది.

సామాన్యుడి అవసరాలను వ్యాపారులు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బియ్యాన్ని బ్రాండ్‌లను మార్చి అవే బియ్యాన్ని అమ్ముతున్నారు. రంగు రంగు సంచులలో, ఇతర జిల్లాల బ్రాండ్‌ల పేరుతో బియ్యాన్ని నింపేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలలో విచ్చలవిడిగా రైస్‌ డిపోలను ఏర్పాటు చేసుకుని వ్యాపారులు సామాన్యులను మోసం చేస్తున్నారు. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్ణీత పరిమితి మేరకు అనుమతులు లేకుండా బియ్యాన్ని విక్రయించవచ్చు. కానీ క్వింటాళ్లు, టన్నుల కొద్ది నిల్వచేసి బియ్యాన్ని అమ్మేవారు కచ్చితంగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఎవరూ కూడా అనుమతులు లేకుండా బియ్యాన్ని విక్రయిస్తున్నారు.

సాధారణ బియ్యం అధిక ధరలకు..

సాధార‌ణ బియ్యాన్ని సైతం వ్యాపారులు అధిక ధ‌ర‌ల‌కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో కొత్త ర‌కం బియ్యం క్వింటాల్ ధ‌ర రూ. 3,200 నుంచి రూ. 3,400 చొప్పున ల‌భించ‌గా, 2023 అక్టోబ‌ర్ నుంచి క్వింటాల్ రూ. 4,500 నుంచి రూ. 5,000 వ‌ర‌కు అమ్ముతున్నారు. ఒకేసారి అమాంతం రూ. 1,300 నుంచి రూ. 1,800ల వ‌ర‌కు పెరిగింది. పాత బియ్యం ధ‌ర రూ. 4,200 నుంచి రూ. 4,500 చొప్పున ల‌భించ‌గా ఇప్పుడు రూ. 5,550 నుంచి రూ. 6,200 చొప్పున విక్రయిస్తున్నారు.

మ‌రో వైపు నిల్వలు త‌క్కువ‌గా ఉండ‌టంతో ధ‌ర‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. నిబంధ‌న ప్రకారం బియ్యం సంచుల‌పై ధ‌ర‌, ప్యాకింగ్ తేదీ, కంపెనీ వివ‌రాలు, చిరునామా ముద్రించాలి. కానీ, వివ‌రాలు ఏవీ లేకుండానే అమ్మకాలు సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యంపై విధించిన ఐదు శాతం ప‌న్నును ఎత్తేసిన త‌ర్వాత క్వింటాల్‌కు రూ. 500 ధ‌ర త‌గ్గాలి. కానీ, ధ‌రలు పెరుగుతున్నాయో త‌ప్ప త‌గ్గడం లేదు. వాస్తవానికి క్వింటాల్ బియ్యం రూ. 4 వేల లోపే ఉండాలి. కానీ, మార్కెట్లో రూ. 4,500 నుంచి రూ. 6,000 వ‌ర‌కు అమ్ముతున్నారు.

కొర‌వ‌డిన ప‌ర్యవేక్షణ‌..

కొన్ని చోట్ల అయితే ఏకంగా రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.5 నుంచి 10 చొప్పున కొనుగోలు చేసి వాటిని పాలిష్‌ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు. వీటినే బీపీటీ, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం తదితర రకాలుగా నమ్మిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే బ్రాండెడ్‌ పేర్లతో కూడిన సంచుల్లో బియ్యం అమ్మాలంటే ముందుగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పేరున రిజిష్టర్‌ చేయడంతో పాటు ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ యాక్డ్‌ 2016 ప్రకారం అనుమతి పొందాలి. ఆ సంస్థ చిరునామా బ్యాగుపై ముద్రించాలి. ఈ సంస్థ చిరునామా బ్యాగుపై ముద్రించాలి. ఇవేవి పాటించని కొందరు వ్యాపారులు రంగురంగుల సంచుల్లో బ్రాండెడ్‌ పేరుతో బియ్యం అమ్ముతూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. కొందరు బియ్యం వ్యాపారులు రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తూ ప్రజలకు అంటగడుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పౌరసరఫరాల శాఖ లోకి రాని అంశం..

ఇది వరకు బియ్యం విక్రయించాలంటే పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉం డేది. కానీ గత మూడేళ్ల క్రితం బియ్యం అమ్మకాలపై పౌరసరఫరాల శాఖ నియంత్రణను ప్రభు త్వం తొలగించింది. బియ్యం విక్రయాన్ని ఆహార భద్రత విభాగం, తూనికలు, కొలతల శాఖ చూడవలసిన అంశంగా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ శాఖలు రైస్‌ డిపొలను తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇక ప‌లు చోట్ల రైస్‌ మిల్లులే అడ్డాలుగా బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వ్యాపారం సాగుతోంది. అయినా అధికారులు చ‌ర్య‌ల‌కు వెన‌కాడుతున్నారు. బియ్యం వ్యాపారం ఇప్పుడు ఏ శాఖ పరిధిలోనిది కాకపోవడంతో బియ్యం వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతుంది. హాలోగ్రామ్‌ కలిగి ఉన్నవారు మాత్రమే బియ్యం అమ్మకాలు చేపట్టాలి. wకానీ రైస్‌ మిల్లర్లు ఒక కంపెనీ పేరుతో బియ్యం విక్రయిస్తున్నారు.

Next Story