ఉమ్మడి జిల్లాను తాకిన ‘పొంగులేటి’ ప్రకంపనలు

by Disha Web Desk 12 |
ఉమ్మడి జిల్లాను తాకిన ‘పొంగులేటి’ ప్రకంపనలు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఆయన కేసీఆర్ సహా ఆయన కుటుంబం, పార్టీపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలుగా మారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను తాకాయి. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి తో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం ఆ తర్వాత పొంగులేటి తీవ్రస్థాయిలో ఆ పార్టీ తీరుపై ఫైర్ అయిన వరుస ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని రాజేశాయి.

అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు అసంతృప్తి నేతలు తాజా పరిణామాలు తమకు అవకాశంగా మారుతాయన్న ఆశతో ఉన్నారు. పొంగులేటి భవిష్యత్ కార్యాచరణ నేపథ్యంలో ఇప్పటికే కొందరు ఆయా రాజకీయ పార్టీల సీనియర్లు ఆయనతో నేరుగా మాట్లాడగా... కొందరు ముఖ్య నేతలకు త్వరలోనే తాను వస్తున్నాను అంటూ పొంగులేటి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అధికార భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్న అనేకమంది అసంతృప్తులకు వేదికగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

పొంగులేటితో జిల్లా నేతలకు అనుబంధం

స్వతహాగా అగ్రశ్రేణి కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు భారీ సాగునీటి ప్రాజెక్టులను పి ఎస్ ఆర్ అండ్ కంపెనీ పేరిట చేపట్టారు. అనేక సందర్భాల్లో ఆయన జిల్లా పర్యటనలకు కూడా వచ్చి వెళ్లారు అప్పట్లో రాజకీయపరంగా రాకపోయినప్పటికీ తన ప్రాజెక్టు పనుల మీద వచ్చిన సందర్భాల్లో అధికార రాష్ట్ర సమితి పార్టీ నేతలతో కలుసుకునేవారు. దీంతో ఆయనకు ఆ పార్టీ సీనియర్ నేతలతో సంబంధాలు బలపడ్డాయి.

పొంగులేటికి జిల్లా నేతల ఫోన్...

అధికార పార్టీపై ఒంటికాలితో లేచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అనేకమంది అధికార పార్టీ నేతలు ఫోన్లు చేశారు. ఈ విషయాన్ని పేర్లు చెప్పేందుకు నిరాకరించిన కొందరు సీనియర్లు పొంగులేటితో టచ్ లోకి వెళుతున్నామని వెల్లడించారు. ఆర్థికంగా అత్యంత బలమైన నేతగా పేరున్న పొంగులేటి తో జతకట్టడం ద్వారా భవిష్యత్తులో రాజకీయంగా లాభపడవచ్చన్న ఆలోచనతో ఆయనకు ఫోన్లు చేసినట్లు చెబుతున్నారు.

త్వరలోనే ఆయన కాంగ్రెస్ లేదా బిజెపిలోకి వెళతారని ఆయన ద్వారానే పార్టీలో చేరితే టికెట్ తో సహా ఆర్థికంగా సహాయం దక్కుతుందన్న ఆశతో కొందరు ప్రజాబలం ఉన్న అధికార పార్టీ నేతలు ఆలోచనలు పడుతున్నారు. మరోవైపు కొందరు ముఖ్య నేతలకు స్వయంగా పొంగులేటి కొంతకాలం క్రితమే ఫోన్ చేసి భవిష్యత్తులో తాను వస్తానంటూ అప్పటివరకు వేచి చూడాలని హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

పశ్చిమ జిల్లా నుంచి ఆసక్తి...

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను బలంగా తాకింది. ఈ జిల్లాకు చెందిన అనేకమంది అధికార పార్టీ సీనియర్లు ఆయన వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముధోల్ నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ సీనియర్ ప్రజాప్రతినిధి ఇప్పటికే పొంగులేటితో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిర్మల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలిద్దరికీ పొంగులేటి క్యాంపు నుంచి ఫోన్లు వచ్చినట్టు ప్రచారం మొదలైంది. నియోజకవర్గం లో కీలకమైన ఒక ఎస్టీ నేతకు, ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ నేతకు కూడా ఫోన్లు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

ఖానాపూర్ నియోజకవర్గం లో ఒక కొత్త ఆశావహ నేత పొంగులేటి నాయకత్వాన్ని బలపరుస్తూ పలువురు నేతలకు స్థానిక నాయకత్వానికి ఫోన్ చేస్తున్నారు. తూర్పు జిల్లాకు చెందిన ఓ రెడ్డి సామాజిక వర్గ నేత అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ అవసరమైతే పొంగులేటి బ్యానర్ పై పోటీ చేస్తానని అక్కడి నేతలతో అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ సింగరేణి కార్మిక నేత సైతం మారుతున్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో ఆయన వైపు మొగ్గుతారని అంటున్నారు. మొత్తంగా పొంగులేటి వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా ప్రభావితం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story

Most Viewed