24 గంటల దవాఖానలో వైద్య సేవలు శూన్యం..!

by Kodari Anjali |

ప్రజలకు 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.

24 గంటల దవాఖానలో వైద్య సేవలు శూన్యం..!
X

దిశ, బజార్‌హత్నూర్: ప్రజలకు 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి సమయంలో పలువురు రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకోగా అక్కడ ఎలాంటి వైద్య సిబ్బంది కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన ఘటన చోటుచేసుకుంది. 24 గంటల వైద్య సేవలు అందిస్తామని చెప్పే దవాఖానలో అత్యవసర పరిస్థితుల్లో కూడా సిబ్బంది లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించి..

రాత్రి సమయంలో అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, అత్యవసర వైద్య అవసరాలు ఎదురైనప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రినే ఆశ్రయిస్తారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు లేదా ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రిలో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించి, 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఆరోగ్య సేవలను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. "24 గంటల దవాఖాన పేరుకేనా..? రాత్రివేళ వైద్య సిబ్బంది లేక రోగుల అవస్థలు" అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story