ఖానాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ట్రబుల్స్

by Disha Web Desk 12 |
ఖానాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ట్రబుల్స్
X

దిశ, ఖానాపూర్: ఖానాపూర్ నియోజకవర్గం పేదలకు అందాల్సిన డబుల్ బెడ్రూం ఇండ్లు కలగానే మిగిలినట్టు ఉంది. ఎన్నో రోజుల పోరాటాలతో సొంత గూడు దక్కుతుందని నిరుపేదలు కలలుగన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో 400 ఇండ్లు, కడంలో 200 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ నేటికీ వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. పెంబి, దస్తురాబాద్, ఉట్నూర్, జన్నారం మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ఊసే లేదు. మొత్తం మీద నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు అందని ద్రాక్షగా మిగిలిపోయాయి.

నియోజకవర్గంలో...

ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ మున్సిపాలిటీ లో 400 ఇళ్లు, కడంలో 200 బుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. పెంబి, దాస్తురాబాద్, ఉట్నూర్, జన్నారం మండలాల్లో డబుల్ బెడ్రూం ఊసే లేదు. జన్నారం మండలంలో డబుల్ బెడ్ రూమ్‌ల కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించారు. కానీ డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం జరగలేదు. కడం మండలంలో నిర్మించినా ఎవరికి కూడా పంపకం జరగలేదు.

నిరాశతో ఖానాపూర్ పట్టణ వాసులు..

ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొమురం భీం చౌరస్తాలో పేద ప్రజలకు 400 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పేద ప్రజల నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు కోరింది. మొత్తం 400 ఇళ్లు నిర్మించగా 708 దరఖాస్తులు వచ్చాయి. మార్చి నెల 2న ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు పర్యవేక్షణలో రెండు పడకల గదుల ఇండ్ల లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారులకు నేటికీ ఇండ్ల పంపిణీ చేపట్టలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపి, సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. లబ్ధిదారులు, వివిధ పార్టీలు దఫాల వారీగా ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదు.

సర్వే పేరుతో జాప్యం

సర్వే పేరుతో లబ్ధిదారుల ఎంపికకు ఆలస్యం చేస్తున్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ నేటికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ తెలిపారు. అర్హులను కాదని అనర్హులకు ఇండ్లు కేటాయించారని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ స్పందించారు. అర్హులైన వారికి అందేలా మళ్ళీ రీ సర్వే చేపిస్తానని అన్నారు. 400 ఇండ్లు పూర్తయ్యాయని, ఇంకా 200 ఇళ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. రీ సర్వేకు ఎమ్మెల్యే హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు.

ఆందోళన చేపడతాం..

డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన వారికి అందేలా రీ సర్వే చేయిస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్ హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అర్హులైన పేదలకు తొందరగా డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు. వారం రోజుల్లో లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేపట్టకపోతే కోర్టును ఆశ్రయిస్తామని మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు రాజు, సత్యం హెచ్చరించారు.


Next Story