జై కొట్టుడేనా.. కార్యకర్తల సమస్యలపై పట్టింపేది..

by Disha Web Desk 20 |
జై కొట్టుడేనా.. కార్యకర్తల సమస్యలపై పట్టింపేది..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : అధికార భారత రాష్ట్రసమితి పార్టీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు అగ్రనేతల భజనకే పరిమితం అవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్లనే ఈ కార్యక్రమాలను పార్టీ అధిష్టానం నిర్వహిస్తున్నదన్న అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఆత్మీయ సమ్మేళనాల్లో కార్యకర్తల మనోభావాలను తెలుసుకోవడంతో పాటు వారి మంచి చెడులు ఆర్థిక స్థితిగతుల వ్యవహారంపై కూడా చర్చించి వారిని ఆదుకోవాల్సి ఉంది. అలాగే సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తూ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన కీలకమైన కేడర్ కు రాజకీయ పదవులు ప్రభుత్వ అధికారహోదా ఉన్న పదవులు ఇచ్చే అంశం పై కూడా చర్చ జరగాల్సి ఉంది. కానీ తాజాగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు అందుకు భిన్నంగా జరుగుతున్నాయన్న అభిప్రాయాలు కార్యకర్తల్లో ఉన్నాయి.

కార్యకర్తల సంక్షేమం పై చర్చలేదు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మొదలయ్యాయి. రెండు పర్యాయాలు ప్రభుత్వం నడిపిన అధికార పార్టీ గతంలో కార్యకర్తలతో ఇలాంటి సమావేశాలు పెట్టలేదు అయితే తాజాగా నిర్వహిస్తున్న సమావేశాల్లో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న పార్టీపరమైన సమస్యలతో పాటు వారి ఆర్థిక స్థితిగతుల మీద రాజకీయ అధికార పదవుల మీద నేతలు ఆరాతీయడం లేదు ఇది చూసి ఇదేమి ఆత్మీయ సమ్మేళనం అంటూ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ కష్టపడండి అన్నసంకేతాలు ఇవ్వడం కోసమేనా ఈ సమావేశాలు పెట్టిందంటూ కార్యకర్తలు లోలోన గొనుక్కుంటున్నారు.

జై కొట్టడం కోసమేనా..

పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రస్తుతం అధికారహోదా చాలా ఇస్తున్న ఎమ్మెల్యేలకు కార్యకర్తలంతా జై కొట్టేందుకే అన్నట్టుగా నడుస్తున్నాయి. మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు వేదికపై తమ ముఖ్య అనుచరులకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారు. వారంతా మాట్లాడుతుంటే కార్యకర్తలు జై కొట్టడం మినహా సాదకబాదకాలపై చర్చ జరగడం లేదు. మళ్లీ అధికారంలోకి రావాలి తమకే పట్టం కట్టాలంటూ వేదికలపై ఎమ్మెల్యేలు పిలుపునివ్వడం దీనికి అనుచరుగణం జై కొట్టడం కనిపిస్తోంది. పార్టీ పరిశీలకులు సమావేశాల్లో సీఎం కేసీఆర్ ను స్తుతించడం మినహా ఆత్మీయ సమ్మేళనంలో పార్టీకార్యకర్తల కోసం అండగా నిలబడే అంశం పై మాట్లాడడం లేదు ఇది కార్యకర్తల్లో కొంత నైరాశాన్ని నింపుతోంది.

అలకనేతలు రాకపోతేనే బేఫికర్ అన్నట్లుగా..

ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సుదీర్ఘకాలంగా పార్టీకోసం పని చేసి అణచివేతకు గురైన అనేకమంది పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉంటున్నారు. వారిని సమావేశాలకు ఆహ్వానించడంపై కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. వారు రాకపోతేనే బేఫికర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఈ సమావేశాలకు హాజరైతే పార్టీ తమను పట్టించుకోని అంశంతో పాటు అధికార పదవులు ఇవ్వని వ్యవహారాలను తెరపైకి తెచ్చి గలాటా సృష్టించే అవకాశం ఉన్నందున వారు రాకుంటేనే బాగుండు అన్నట్లుగా ఎమ్మెల్యేల పరిస్థితి తయారైంది. సమావేశాలకు హాజరవుతున్న పార్టీ రాష్ట్ర ఇంచార్జీలు హాజరుకాని నేతల సమాచారాన్ని కనీసం అడగడం లేదు. ఈ పరిణామాలు పార్టీపై ఆత్మీయత ఏమో గాని తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి వసంత నేతలు పార్టీని వీడి ఇతర పార్టీ అవకాశం ఉందని స్పష్టమవుతుంది.

Next Story

Most Viewed