కూలిన అందవెల్లి తాత్కాలిక వంతెన

by Disha Web Desk 15 |
కూలిన అందవెల్లి తాత్కాలిక వంతెన
X

దిశ, కగాజ్ నగర్ : ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా అందవెల్లి బ్రిడ్జి నిర్మాణం వద్ద తాత్కాలిక వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలకు ప్రమాదం పొంచి ఉంది. బుధవారం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. పైన కురిసిన భారీ వర్షాలతో పెద్దవాగు నీటి ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా తెగిపోయింది. గమనించిన కూలీలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాకపోకలను నిలిపివేసి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. గత వర్షాకాలం కురిసిన భారీ వర్షాలకు అందవెల్లి బ్రిడ్జి పెద్దవాగు నీటి ఉధృతికి పిల్లర్లు కోతకు గురై వంగిపోయింది. దీంతో రెండు నెలలు 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా గ్రామాల నుండి కాగజ్ నగర్ పట్టణానికి వెళ్లే పాఠశాల విద్యార్థులు, వ్యాపారస్తులు, దాహేగం, భీమిని, తాండూరు మండలాల మీదుగా 60 కిలోమీటర్లు ప్రయాణించి కాగజ్నగర్ పట్టణానికి చేరుకోవాల్సి వస్తుంది.

40 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం లేకుండా గతంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందవెల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టేందుకు దేవాలయ, అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ప్రభుత్వం 13 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణ పనులను వల్లభనేని కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులను అప్పగించింది. నాలుగు నెలలుగా బ్రిడ్జి నిర్మాణం పనులు నడుస్తున్నాయి. కాగా వర్షాకాలం ప్రారంభ దశలోనే అకాల వర్షాలు పడడంతో బ్రిడ్జి నిర్మాణం పక్కన వాహనాలు వెళ్లేందుకు పైప్ లైన్ వేసి తాత్కాలిక వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ఇటీవల భారీ వర్షం పడడంతో తాత్కాలిక వంతెన కుంగిపోయి పూర్తిగా తెగిపోయింది.

ఎమ్మెల్యే హామీ నెరవేరేనా?

గత సంవత్సరం భారీ వర్షాలతో అందవెల్లి బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రతిపక్షాలు అక్కడికి చేరుకొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేయడంతో కదలిన ఎమ్మెల్యే చాలెంజ్ గా తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులను రాబట్టారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్​కు పనులు అప్పజెప్పడంతో బ్రిడ్జి నిర్మాణం పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఈ వర్షాకాలానికైనా నెరవేరేనా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed