లంచావతారం.. ఏసీబీ వేటలో మరో ఇద్దరు

by Thanuru Gopichand |

ఏసీబీ దాడులు జరుగుతున్నా ఆగని అధికారుల అవినీతి.

లంచావతారం.. ఏసీబీ వేటలో మరో ఇద్దరు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవడం హక్కుగా భావిస్తున్న పరిణామాలు ఉద్యోగస్వామ్య వ్యవస్థ వెక్కిరించేలా మారుతున్నది. వరుసగా ఏసీబీ దాడుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులు, ఉద్యోగులు తరచూ పట్టుబడుతున్నప్పటికీ అవినీతి లంచావతారులు ఎక్కడో ఒకచోట తమ ప్రతాపం చూపుతూనే ఉన్నారు. ఏసీబీ కఠినంగా ఉందన్న సమాచారం ఉన్నప్పటికీ.. తమను ఎవరు పట్టుకుంటారన్న భావనతో లంచాలకు మరిగిన అధికారులు, ఉద్యోగులు తమ అవినీతిని మాత్రం ఆపడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో పట్టుబడుతున్న అవినీతి ఉద్యోగుల పరంపరతో ఏసీబీ అధికార యంత్రాంగమే ముక్కున వేలేసుకుంటున్నది.

వరుస కేసులతో కలకలం...

నిర్మల్ జిల్లాలో గత ఏడాది కాలంలో ప్రతినెల ఒకటి నుంచి రెండు కేసులు నమోదు అవుతున్నాయి. అవినీతి నిరోధక శాఖ విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో లంచం లేనిదే పని కావడం లేదన్న ఆవేదనతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజా పరిణామాలు ఉద్యోగ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితమే బైంసా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్ భీమన్న తొమ్మిది వేల రూపాయలు డిజిటల్ ట్రాన్స్ఫర్ విధానంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇది మరిచిపోక ముందే తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ల్యాండ్ రెవెన్యూ శాఖకు చెందిన సర్వే బాలకృష్ణ ఆయన వద్ద పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి నాగరాజు ఇద్దరూ 7500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

గత ఏడాది అక్టోబర్ 23న మామడ ఎస్సై రాజు స్టేషన్ బెయిల్ కోసం పదివేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు నవంబర్ 4న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గిఫ్ట్ డిడ్ చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ ఆయన వద్ద పనిచేసే ప్రైవేటు ఉద్యోగి రాజు 8000 లంచం తీసుకుంటూ దొరికిపోయారు. డిసెంబర్ 18న జిల్లా కార్మిక శాఖ అధికారి సాయిబాబా ఆయన కుమారుడు ద్వారా 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. జనవరి 10వ తేదీన కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్య భూమి పట్టాల విషయంలో తొమ్మిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. నిర్మల్ పురపాలక సంఘంలో రెవెన్యూ అధికారి గంగాధర్, బిల్ కలెక్టర్ ఒక ఇల్లు అసెస్మెంట్ కోసం మూడున్నర వేలు నగదు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇలా వరుసగా పట్టుబడుతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ అవినీతి మాత్రం ఆగడం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Next Story