అమ్మవారి గుడికి అగ్రపీఠం..ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న చదువుల తల్లి నిలయం

by Dishanational2 |
అమ్మవారి గుడికి అగ్రపీఠం..ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న చదువుల తల్లి నిలయం
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన సరస్వతీ క్షేత్రాల్లో రెండో పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నచదువుల తల్లి కొలువుదీరిన బాసర చారిత్రాత్మక ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతున్నది. 100 కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్తో ఆలయం వృద్ధి చెందుతోంది. ఈ మేరకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అత్యంత ఖరీదైన కృష్ణశిలతో అమ్మవారి గర్భాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే రెండేళ్లలోగా నిర్మాణం పూర్తి చేసుకుని తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన యాదాద్రి తరహాలో బాసర పుణ్యక్షేత్రం భక్తులకు దర్శనం ఇవ్వనున్నది.

రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు..

నిర్మల్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రం అభివృద్ధికి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది దేవాదాయ శాఖ పరిధిలో ఉండే కామన్ గుడ్ ఫండ్ కింద ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంత జిల్లా అయిన నిర్మల్ లో సుమారు 81 ఆలయాలకు నిధులు మంజూరు కాగా బాసర పుణ్యక్షేత్రం కోసం సింహభాగం నిధులు ఇచ్చి ఆలయానికి అగ్ర పీఠం వేశారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం..

ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కింద 50 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. పనులు కూడా మొదలయ్యాయి. ఈ నిధుల్లో ఇప్పటికే 8 కోట్లు మంజూరు కాగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారి గర్భాలయ నిర్మాణాన్ని ఖరీదైన కృష్ణశిరతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉండే మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ప్రత్యేక నిర్మాణాన్ని చేపడుతున్నారు. అలాగే ప్రాకార మండపం శివాలయం పునప్రతిష్ట నాలుగు దిక్కుల రాజ గోపురాల నిర్మాణం దత్తాత్రేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట స్థలమర్పిడి వంటి పనులను కూడా చేపడుతున్నారు. యాగశాల మండప విస్తరణ ధ్వజస్తంభం నిర్మాణాలకు కూడా ఇవే నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. వచ్చే ఏడాదిలోగా పనులు దాదాపుగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

భక్తులకు కనువిందు చేసేలా..

దక్షిణ భారతం లోనే ఉన్న ఏకైక సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా జరిగే వసంత పంచమి మూలా నక్షత్రం దుర్గాష్టమి వేడుకలు నవరాత్రులు వంటి పుణ్యథితుల్లో భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. ఇటీవల కాలంలో అమ్మవారికి క్షేత్రానికి మరింత ప్రాచుర్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే స్పెషల్ గ్రేడ్ దేవాలయాల జాబితాలో ఉన్న బాసరను అభివృద్ధి చేసేందుకు గాను ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ కింద నిధులను విడుదల చేస్తోంది. ఆలయ నిర్మాణంతోపాటు పరిసరాలను, పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు బాసర రైల్వే స్టేషన్ నుంచి ఆలయం దాకా అక్కడి నుంచి గోదావరి దాక నాలుగు లైన్ల రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ పూర్తయితే బాసర సుందర క్షేత్రంగా భక్తులకు కనువిందు చేసే అవకాశం ఉంది.

ఇంకా ఎన్నైనా నిధులు..

బాసర ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారు. యాదాద్రి తరహాలో బాసర అభివృద్ధి కోసం 100 కోట్లు నిధులు ఇస్తున్నారు. ఇప్పటికే 50 కోట్లు మంజూరు ఇస్తూ చర్యలు తీసుకున్నాం. పనులు ప్రారంభం అయ్యాయి. సరస్వతి అమ్మవారి క్షేత్రం అభివృద్ధి కోసం ఇంకా ఎన్నైనా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.

దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి



Next Story

Most Viewed