విచారణకే పరిమితం చర్యలు శూన్యం.. అస్తవ్యస్తంగా విద్యుత్ శాఖ

by Disha Web Desk 9 |
విచారణకే పరిమితం చర్యలు శూన్యం.. అస్తవ్యస్తంగా విద్యుత్ శాఖ
X

దిశ, వైరా: "నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న చందాగా ఉంది ఎన్పీడీసీఎల్ పరిస్థితి. వైరా డివిజన్లోని విద్యుత్ శాఖలో బహిర్గతమైన అనేక అవకతవకలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి చేతులు దులుపుకున్నారు. అయితే నేటి వరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కనీస చర్యలు తీసుకోవడంలో ఎన్పీడీసీఎల్ సంస్థ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినవస్తున్నాయి. వైరా విద్యుత్ డివిజన్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించటంతో కింద స్థాయి అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది. విద్యుత్ శాఖలో జరిగిన అనేక అవకతవకలపై, ఇష్టారాజ్యంగా విధులకు వస్తున్న అధికారులపై దిశలో ఇప్పటికే అనేక వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. అయినప్పటికీ ఎన్పీడీసీఎల్ సంస్థ విచారణ పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప బాధ్యులపై కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు దారితీస్తుంది. వైరాలోని విద్యుత్ వినియోగదారులు సీఎండీ సార్ మీకు ఇది తగునా అని ప్రశ్నించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది.

విచారణ సరే.....చర్యలేవి

వైరాలోని బ్రాహ్మణపల్లి రెవిన్యూలో ఉన్న ఆజాద్ టౌన్షిప్‌కు మున్సిపాలిటీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే విద్యుత్తు లైన్ ప్రతిపాదనను స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు పంపారు. అయితే ఉన్నతాధికారులు కూడా "పిల్లి కళ్లు మూసుకొని తాను పాలు తాగేది ఎవరూ చూడటం లేదన్నట్లుగా" ఆజాద్ టౌన్షిప్‌కు విద్యుత్ లైన్ కోసం ప్రతిపాదన మంజూరు చేశారు. అదేవిధంగా ఈ టౌన్షిప్‌కు గతంలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 80 మీటర్ల సర్వీస్ వైర్‌తో విద్యుత్ కనెక్షన్‌ను మంజూరు చేశారు.

ఈ విషయాన్ని దిశ బహిర్గతం చేయటంతో ఏప్రిల్ 14వ తేదీన వరంగల్ క్వాలిటీ కంట్రోల్ డిఇ శ్రీనివాస్, ఏడిఏ మహమ్మద్ రహీం హుస్సేన్ విచారణ నిర్వహించారు. ఈ అధికారుల విచారణలో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా సుమాలు 80 మీటర్ల దూరంతో అప్పట్లో విద్యుత్ కలెక్షన్ ఇచ్చిన విషయం స్పష్టమైంది. అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్ఓసి లేకుండా విద్యుత్ ప్రతిపాదనల మంజూరి విషయం వెలుగులోకి వచ్చింది . వైరాలో సంబంధిత అధికారులు, సిబ్బంది వివరణను విచారణ అధికారులు సేకరించారు.

విచారణ నిర్వహించి 20 రోజులు గడుస్తున్నా నేటి వరకు కనీస చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా వైరా సబ్ స్టేషన్‌లోని క్యాంపర్ వాహనాన్ని ఓ అధికారి తన ఇష్టారాజ్యంగా సొంత పనులకు ఉపయోగించుకుంటున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఏదులాపురంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన సదరు అధికారి వైరాలో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. రోజుకు సాయంత్రం రెండు గంటలు మాత్రమే ఆఫీసుకు విధులకు హాజరు కావడం, మీటర్లు మంజూరిలో వినియోగదాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం పరిపాటిగా మారింది.

బోనకల్‌కు చెందిన రాజశేఖర్ అనే వినియోగదారుడిని రెండు మీటర్లు మంజూరు చేసేందుకు ఏడిఏ రెండు నెలల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు . ఈ విషయమై వరంగల్ క్వాలిటీ కంట్రోల్ శ్రీనివాస్ ద్వారా సీఎండికు రాజశేఖర్ ఫిర్యాదు చేసిన నేటి వరకు కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు దారితీస్తుంది. రాజశేఖర్‌ను విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటే 20 రూపాయలు బాండ్ పేపర్‌పై భవిష్యత్తులో మీటర్లు అడగనని రాసి ఇవ్వాలని బోనకల్ ఏఈ ద్వారా ఏడిఏ వేధించిన విషయము వెలుగులోకి వచ్చిన నేటి వరకు ఎన్పీడీసిఎల్ సంస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది.

వైరా సబ్ స్టేషన్ల పని చేసే ఫోర్ మెన్ రోజు ఉదయం పదిన్నర గంటలకు సబ్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న పట్టించుకున్న వారే కరువయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో వైరాలో ప్రభుత్వ భూముల్లో ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలు తొలగించారు. ఈ ఆక్రమణ తొలగించిన ప్రాంతాల్లో మరలా చేపడుతున్న ఆక్రమణలకు విద్యుత్ శాఖ అధికారులు అండగా ఉంటూ మీటర్లు రీ ఓపెన్ చేయటం విశేషం. దశాబ్దాలుగా ఏఈ కార్యాలయంగా ఉన్న భవనాన్ని ఏడీఏ తన కార్యాలయం గా మార్చుకున్న విషయంపై కూడా ఉన్నతాధికారులు స్పందించకపోవడం విశేషం.

విద్యుత్ శాఖలోని అత్యధిక మంది అధికారులతో పాటు సిబ్బంది స్థానికంగా ఉండకుండా ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వైరాకు డైలీ సర్వీస్ చేయటం విశేషం. ఎన్పీడీసీఎల్ సిఎండి పై ఎంతో నమ్మకంతో తాను ఏడిఏ పై ఫిర్యాదు చేశానని, కానీ నేటి వరకు కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు దారితీస్తుందని వినియోగదాడు రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వైరాలో అనేక ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యను గుర్తించడంలో కూడా ఫోర్ మెన్ పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా ఎన్పీడీసీఎల్ సిఎండి వైరా విద్యుత్ శాఖలోని అధికారుల, సిబ్బంది బాగోతంపై సీరియస్ గా చర్యలు తీసుకుంటారో....? లేదంటే విద్యుత్ శాఖకు ఇదంతా "మామూలే" అని వదిలేస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed